బాబు మార్కు చొరవ ఎవ్వరికీ సాధ్యం కాదంతే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు. వారి విషయం ఏమో గానీ.. చంద్రబాబు పర్యటనలను చూస్తున్న సామాన్య జనం అయితే చంద్రబాబు నూటికి రెండు వందల శాతం మారిపోయారంటూ హారతులు పడుతున్నారు. పేదరికం లేని సమాజమే తన లక్ష్యమంటూ నిత్యం చెప్పుకునే చంద్రబాబు… ఆ దిశగా గతంలోనూ అడుగులు వేసినా… ఇప్పుడు పేదరికాన్ని పారదోలే దిశగా ఆయన సాగుతున్న తీరు… పేదింటిలోకి దూసుకుపోతున్న తీరు చూసి న్యూట్రల్ జనం కూడా విస్తుపోతున్నారు. మంగళవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తగొల్లపాలెంలో చంద్రబాబు పర్యటనను చూసిన తర్వాత ఈ మాట నిజమేనని చెప్పాలి.

ప్రతి నెలా పింఛన్ల పంపిణీ సందర్భంగా రాష్ట్రంలోని ఏదో ఒక గ్రామానికి వెళుతున్న చంద్రబాబు ఆయా గ్రామాల్లోని పేదల ఇళ్లల్లోకి వెళుతున్నారు. పింఛన్ల సొమ్మును వారి చేతిలో పెట్టిన తర్వాత…వారి ఇళ్లను ఆసాంతం పరిశీలిస్తున్నారు. ఏదో అలా హాలులో కూర్చుని ఫొటోలకు ఫోజులు ఇచ్చి బయటకు రాకుండా…ఆయా ఇళ్లల్లో చంద్రబాబు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా పేదల ఇళ్లల్లోని వంట గదుల్లోకి చంద్రబాబు తప్పనిసరిగా అడుగు పెడుతున్నారు. కొన్ని ఇళ్లల్లో ఆయా వంట గదుల్లో తానే స్టౌ వెలిగించుకుని మరీ కాఫీనో, తేనీరో పెట్టుకుని మరీ… దానిని ఆ కుటుంబ సభ్యులకు అందిస్తూ తానూ సేవిస్తూ సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయా ఇళ్లను ఆమూలాగ్రం పరిశీలిస్తున్న చంద్రబాబు… ఆ ఇళ్లను మరింతగా అభివృద్ది చేసేందుకు ఉన్న అవకాశాలపైనా చంద్రబాబు పరిశీలిస్తున్నారు.

మంగళవారం నాటి పర్యటన తీరు చూస్తే… బాబు ప్రవేశించిన ఇంటిలో వంట గదిని పరిశీలించగా…అందులో స్టౌ కనిపించ లేదు. దీంతో అదేంటీ వంట గదిలో స్టౌ లేదేంటీ అని చంద్రబాబు ప్రశ్నించారు. వారు బయట ఉందంటూ చెప్పగా… వారి కంటే ముందే చంద్రబాబు వంట గదికి ఉన్న ద్వారం ద్వారా బయటకు వచ్చి… అక్కడ ఏర్పాటు చేసిన స్టౌను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందుకు వారు చెప్పిన కారణాలను విన్న చంద్రబాబు… ఆ ఇంటిని మరింతగా విస్తరించుకుంటే బాగుంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, దానికి సరిపడ సాయాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పారు. మొత్తంగా పేదల ఇంటిలోకి వెళ్లే ఏ నేత అయినా మొక్కుబడిగానే అక్కడ ఉండి వస్తారు. కాని చంద్రబాబు అందుకు భిన్నంగా సాగుతున్నారు. పేదింటిని పెద్దింటిగా మార్చే దిశగా ఆయా కుటుంబాలకు ఆయన సలహాలు ఇస్తుండటంతో పాటుగా అందుకు తగిన సాయాన్ని కూడా చేస్తున్నారు.