జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజకీయ వ్యూహాలు మేధావులకు సైతం అంతుచిక్కడం లేదు. ఆయన పొలిటికల్ కత్తికి రెండు పక్కలా పదునేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వ్యూహం వైసీపీకి ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును మరింత డైల్యూట్ చేయడం.. వచ్చే ఎన్నికల్లోనూ కూటమిని విజయతీరాలకు చేర్చడమే. అయితే.. ఈ విషయంలో జనసేనలో ఒకింత తడబాటు కనిపిస్తోంది. ఆది నుంచి జనసేన అధినేతను సీఎంగా చూడాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు.
అయితే.. ఈ విషయంపై పవన్ ఎక్కడా క్టారిటీ ఇవ్వడం లేదు. తాను ఎప్పుడు సీఎం అవుతానన్నది ఆయన చెప్పకుండానే.. పదిహేనేళ్లు తాము కలిసి కొనసాగుతామంటూ.. కూటమిని ప్రస్తావిస్తున్నారు. అంటే.. వచ్చే 15 ఏళ్లపాటు ఆయన సీఎం అయ్యే అవకాశం లేదన్నది స్పష్టమవుతోంది. ఇది జనసేనను ఇబ్బందికి గురిచేస్తోంది. మరో రెండు మూడు ఎన్నికల వరకు తాము ఓర్పుతో ఉండకతప్పదన ఆలోచన జనసేనలో వినిపిస్తోంది.
అయితే.. ఇదిశాస్వతమేనా? అనేది కూడా చర్చకు వస్తోంది. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల నాటికి సహజం గానే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామిగా ఉన్నందున.. ఈ వ్యతిరేకత జనసేనకు కూడా పాకే అవకాశం తప్పదు. దీనిని పవన్ ఊహించకుండా ఉండరు. ఒకవేళ ఇదే నిజమై… ప్రభుత్వ వ్యతిరేకత కనుక పెరిగితే.. అప్పుడు ప్లాన్ -బీని అమలు చేయడం ఖాయమని మరో చర్చ కూడా జరుగుతోంది.
వచ్చే ఎన్నికలకు ముందుగానే ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేసుకుని.. అవసరమైతే.. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఓటర్లను మెప్పించే అవకాశం ఉంటుందన్న అంచనా వస్తోంది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు.. పార్టీని తప్పించేందుకు.. తాము 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలని అనుకున్నా.. కొన్ని కారణాలతో బయటకు వచ్చామని చెప్పడంతోపాటు.. డిప్యూటీ సీఎంగా తాను పరిణితి చెందానన్న వాదనను కూడా.. పవన్ వినిపించే అవకాశం ఉంది. తద్వారా వ్యతిరేక ఓట్లను చీలకుండా.. చీలినా వైసీపీకి పడకుండా.. పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం.