విశాఖలో లోకేశ్… జై షాతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ వీక్షణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం వెళ్లారు. ఆదివారం తెలుగు సంవత్సరాది సందర్భంగా ఇంటిలో పూజాధికాల అనంతరం విశాఖకు బయలుదేరిన లోకేశ్… అక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించారు. ఈ మ్యాచ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీపీ) చైర్మన్ జై షా కూడా హాజరయ్యారు.

విశాఖలోని క్రికెట్ స్టేడియం చేరుకున్న తర్వాత జై షాతో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనతో పాటు స్టేడియానికి వచ్చిన టీడీపీ నేతలు సానా సతీశ్, బండారు సత్యనారాయణ మూర్తి, గంటా శ్రీనివాసరావు తదితరులను జై షాకు లోకేశ్ పరిచయం చేశారు. అనంతరం జై షాతో లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమరావతిలో నిర్మించతలపెట్టిన క్రికెట్ స్టేడియం, ఏపీలో క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింతగా విస్తరించే అంశాలపై ఆయనతో లోకేశ్ చర్చించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే… గతంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ ల మధ్య దుబాయిలో జరిగిన క్రికెట్ మ్యాచ్ ను కూడా లోకేశ్ ప్రత్యక్షంగా వీక్షించిన సంగతి తెలిసిందే. తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి దుబాయి వెళ్లిన లోకేశ్… దాయాదుల పోరును తిలకించారు. నాడు కూడా ఆ మ్యాచ్ కు వచ్చిన జై షాతో లోకేశ్ భేటీ అయ్యారు. ఆ తర్వాత జై షాతో తాను ఏమేం అంశాలు చర్చించానన్న విషయాన్ని లోకేశే స్వయంగా వెల్లడించారు. తాజాగా ఆదివారం విశాఖలో జై షా, లోకేశ్ లు పక్కపక్కనే కూర్చని ఐపీఎల్ మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగానూ వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి.