నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా ఎంపిక చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంకో రెండు పర్యాయాలు కూడా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమే. అంతేకాదండోయ్… అర్హత ఉండి ఇప్పటికిప్పుడు తగిన పదవులు దక్కని వారికందరినీ దశల వారీగా పదవులు దక్కుతాయని…అది కూడా చంద్రబాబు ద్వారానే సాధ్యమవుతుందనీ తేలిపోయింది. ఈ మేరకు ఉగాది ఆస్థానంలో ప్రముఖ పంచాంగ శ్రవణకర్త మాడుగుల నాగఫణి శర్మ భవిష్యవాణిని వినిపించారు.
ఆదివారం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించకుని ఏపీ ప్రభుత్వం విజయవాడలోని తమ్మలపల్లి కళాక్షేత్రంలో అదికారికంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహించింది. ఈ ఆస్థానంలో మాడుగల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి గురించి ఆసక్తికర అంశాలను వినిపించారు. ఇప్పటిదాకా అమరావతి సాగుతూ, ఆగుతూ కదిలినా ఇకపై నగరానికి ఎలాంటి ఢోకా ఉండబోదని తెలిపారు. అమరావతి నిర్మాణం ఇకపై నిర్విరామంగా సాగిపోతుందని కూడా ఆయన సెలవిచ్చారు. అంతేకాకుండా అమరావతి నగరం సీఎం చంద్రబాబు ఆశిస్తన్నట్లుగా అతి త్వరలోనే విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుందని కూడా శర్మ ప్రవచించారు.
ఇక సీఎం చంద్రబాబు భవిష్యత్తు గురించి ప్రస్తావించిన శర్మ… మరో పది, పదిహేనేళ్ల దాకా చంద్రబాబు అధికారానికి ఢోకా లేదని తెలిపారు. ఇప్పటికే నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… ఐదు, ఆరో సారీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారని ఆయన సెలవిచ్చారు. వెరసి మరో పదిహేనేళ్ల దాకా చంద్రబాబు అధికారంలోనే కొనసాగుతారని ఆయన తెలిపారు. ఇక టీడీపీ నేతలు, కూటమి పార్టీల నేతల విషయాన్ని ప్రస్తావించిన శర్మ… పదవులు రాలేదని బాధ పడాల్సిన అవసరం లేదని నేతలకు సూచించారు. అర్హత ఉన్న నేతలకు కాస్తంత ఆలస్యమైనా వారి అర్హతల మేరకు పదవులు దక్కుతాయని తెలిపారు. చంద్రబాబు చేతుల ద్వారానే ఆయా పదవులు నేతలకు అందుతాయని శర్మ తెలిపారు.