ఏపీలో వెంక‌య్య వ‌ర్గం ఏమైంది?

ఏపీ రాజ‌కీయాల్లో.. బీజేపీకి ఓటు బ్యాంకు ఉందా లేదా? అనే విష‌యాన్ని పక్క‌న పెడితే.. ఓ వ‌ర్గం బీజేపీ నేత‌లు మాత్రం ఎప్పుడూ మీడియాలో ట‌చ్‌లో ఉండేవారు. ప్ర‌భుత్వంపై సునిశిత విమ‌ర్శలు చేయ‌డంతో పాటు.. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేవారు. అదేస‌మ‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వాన్ని స్తుతించేవారు. అయితే… ఇప్పుడు ఈ వ‌ర్గం జాడ క‌నిపించ‌డంలేదు. ఎక్క‌డి వారు అక్క‌డే సైలెంట్‌! అయిపోయారు. మ‌రి ఏం జ‌రిగింది? ఇంత‌కీ ఏమిటా వ‌ర్గం.. అంటే.. ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్య కేంద్ర మంత్రిగా చ‌క్రం తిప్పిన స‌మ‌యంలో ఆయ‌న వ‌ర్గంగా పేరు బ‌డ్డ నాయ‌కులు.

వారిలో మాజీ ఎంపీలు కంభంపాటి హ‌రిబాబు, గోక‌రాజు గంగ‌రాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస‌రావు, పి. స‌న్యాసి రాజు.. ఏలూరి సాంబ‌శివ‌రావు ఇలా కొంద‌రు వెంక‌య్య వ‌ర్గంగా ఉండేవారు. వీరంతా వెంక‌య్య క‌నుస‌న్న‌ల్లో ఏపీలో రాజ‌కీయాలు చేశారు. ఆయ‌న ఉప‌రాష్ట్ర‌ప‌తి అయ్యాక కూడా కొన్నాళ్లు యాక్టివ్‌గానే ఉన్నారు. ఇక‌, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏపీ చీఫ్‌గా ఉన్న‌స‌మ‌యంలోనూ వీరిలో ఒక‌రిద్ద‌రు బాగానే స్పందించారు. కానీ, సోము వీర్రాజు రాష్ట్ర చీఫ్‌గా వ‌చ్చిన త‌ర్వాత మాత్రం అంద‌రూ సైలెంట్ అయ్యారు. దీంతో అస‌లు ఏం జ‌రిగింది? ఎందుకు వీరంతా మౌనం పాటిస్తున్నారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.

నిజానికి వెంక‌య్య వ‌ర్గం అంటే.. దాదాపు టీడీపీకి అనుకూల వ‌ర్గం గా పేరుంది. ఏ విష‌యంలో అయినా.. విమ‌ర్శ‌లు చేయాల్సి వ‌స్తే.. చంద్ర‌బాబును త‌ప్పించి వ్యాఖ్య‌లు చేసేవారు. ఇక‌, జ‌గ‌న్ విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. అలాగ‌ని ఆయ‌న‌పై ప్రేమ ఉంద‌ని కాదు. కానీ, అస‌లు నాయ‌కుడిగా కూడా గుర్తించేందుకు వారు ఇష్ట‌ప‌డే వారు. కానీ, అనూహ్యంగా జ‌గ‌న్ స‌ర్కారు రావ‌డం.. వీరి మౌనానికి కార‌ణ‌మ‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. అయితే, గంగ‌రాజు త‌న కుమారుడు రామ‌రాజు, త‌మ్ముడు న‌ర‌సింహ‌రాజుల‌ను వైసీపీలోకి పంపేశారు. పైకి , ఆయ‌న త‌న‌కు సంబంధం లేద‌ని అంటున్నా.. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

మ‌రోవైపు.. బీజేపీని బ‌లోపేతం చేసేందుకు ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోరు. పోనీ.. స‌ర్కారు లోపాల‌ను ఏమైనా ఎత్తి చూపుతున్నారా? అంటే.. అది కూడా లేదు. కామినేని మొన్నామ‌ధ్య‌.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ విష‌యంలో హైకోర్టులో కేసు వేసి.. స‌ర్కారును ఇబ్బంది పెట్టారు. త‌ర్వాత ఆయ‌న ఐపు లేకుండా పోయారు. కంభంపాటి హ‌రిబాబు అస‌లు ఎక్క‌డ ఉన్నారో తెలియ‌దు. ఏలూరి సాంబ‌శివ‌రావు.. అనారోగ్య కార‌ణాల‌తో త‌ప్పుకున్నట్టు చెబుతున్నా.. వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు కొన్నాళ్ల కింద‌ట ప్ర‌య‌త్నించారు. ఇలా ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా సీనియ‌ర్లు ఉన్నారు. దీని వెనుక మ‌రో కార‌ణం కూడా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర పార్టీ చీఫ్ సోము వీర్రాజు వీరిని క‌ట్ట‌డి చేయించార‌ని, పార్టీ పెద్ద‌ల‌తో మాట్లాడి.. త‌న స్వేచ్ఛ‌కు అడ్డు ప‌డ‌తార‌నే ఉద్దేశంతో వీరిని సైలెంట్ చేయించార‌ని ఒక టాక్ న‌డుస్తోంది. ఏదేమైనా.. సీనియ‌ర్లు, గ‌తంలో ప‌దవుల ద్వారా బీజేపీలో పేరు తెచ్చుకున్న‌వారు ఇలా మౌనం పాటించ‌డంపై మాత్రం పార్టీలో ద్వితీయ శ్రేణి నేత‌లు ఒకింత ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ద‌శ‌-దిశ చూపించాల్సిన నాయ‌కులు ఇలా మౌనం పాటిస్తే.. ఎలా? అనేది వీరి మాట‌. మ‌రి ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తారో చూడాలి.