టీడీపీ ఎమ్మెల్యే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్వయం ప్రకటిత మేధావి కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం మరింత ముదిరింది. ఇప్పటికి ఏడాది కాలంలో(ఇంకా పూర్తికాలేదు) ఆయన అనేక సందర్భాల్లో వివాదాస్పదంగా వ్యవహరించారు. అయినప్పటికీ.. కొత్త కదా.. త్వరలోనే లైన్‌లోకి వస్తాడులే
అంటూ.. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఆయనకు క్లాస్ ఇచ్చారు. పార్టీ నాయకులతోనూ క్లాస్ ఇప్పించారు. అయినా.. కొలికపూడిలో మార్పు రావడం లేదు. పైగా.. సొంత పార్టీనే రోడ్డున పడేసేలా వ్యవహరిస్తున్నారు. దీంతో విసిగిపోయిన.. చంద్రబాబు ఫైనల్ వార్నింగ్ కు రెడీ అయ్యారు.
ఎన్టీఆర్ జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం తిరువూరును.. గత ఏడాది ఎన్నికల్లో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు కేటాయించాలని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కొలికపూడి శ్రీనివాసరావుకు చంద్రబాబు వరమాల వేశారు. అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతో ఆయనను చంద్రబాబు అక్కున చేర్చుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇక, కూటమి హవాలో తొలిసారే పోటీ చేసినా.. కొలికపూడి విజయం దక్కించుకున్నారు. ఆవెంటనే ఆయన రెబల్ తరహాలో కూటమి సర్కారుపై నిప్పులు చెరగడం ప్రారంభించారు.
రోడ్లలో గుంతలు పూడ్చలేదంటూ…తిరువూరులోని ప్రధాన రోడ్లలో స్టూల్ వేసుకుని కూర్చుని ధర్మాగ్రహం పేరుతో భారీ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో తొలిసారి క్లాస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. తర్వాత.. వైసీపీ నాయకులకు చెందిన ఇళ్లను తనే స్వయంగా బుల్ డోజర్లు నడిపి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. వారికి అన్ని అనుమతులు ఉన్నాయని మునిసిపల్ అధికారులు చెప్పినా వినకుండా బండబూతులు తిడుతూ.. వెళ్లి అన్నంత పనిచేశారు. దీనిపై సదరు నాయకుడు కోర్టుకు వెళ్లడంతో సర్కారుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ తర్వాత మద్యం అమ్మకాలపై కూడా ఇదే తరహాలో కొలికపూడి యాగీ చేశారు. సొంత పార్టీకి చెందిన నాయకుల దుకాణాలపై దాడులు చేసి.. వారు అక్రమ వ్యాపారం చేస్తున్నారని.. ఆరోపించారు.కానీ వారు పత్రాలు చూపించినా.. వినిపించుకోలేదు. ఈ వ్యవహారం మరింతగా పార్టీని కుదిపేసింది. ఇక, వైసీపీ ఎంపీపీ అయిన ఓ మహిళను దూషించడంతో.. ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఇది కూడా పార్టీకి తలనొప్పిగా మారింది.
తాజాగా సొంత పార్టీ నాయకుడు రమేష్‌పై నిప్పులు చెరిగిన కొలిక పూడి.. ఆయనను 2 రోజుల్లోగా పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే.. తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని..నేరుగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి సవాల్ రువ్వారు. ఈ వ్యవహారం ముదరడంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫైనల్ వార్నింగ్ ఇష్యూ చేశారు. అసలు కొలిక పూడి వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఎంపీ సహా.. పలువురు సీనియర్ నాయకులను ఆదేశించారు. దీంతో చివరకు ఏం జరుగుతుందనేది చూడాలి.