వైసీపీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఉత్తరాంధ్రకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడా తగ్గడం లేదు. ఆయనపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఉన్నా.. ఎలాంటి బలమైన కేసులు నమోదు కాలేదు. అయితే.. పోలీసులు మాత్రం అవకాశం కోసం చూస్తు న్నారు. కుటుంబ కలహాలు.. భార్యతో వివాదాలు.. ప్రియురాలితో ముచ్చట్లు.. ఇలా దువ్వాడ పలు సందర్భాల్లో మీడియాలో హైలెట్ అయ్యారు. అంతేకాదు.. పవిత్ర తిరుమలలో ప్రియురాలితో వెళ్లి ఫొటో షూట్ కూడా చేసి వచ్చారు. దీనిపై టీటీడీ అధికారులు కేసు నమోదు చేయాలని అనుకున్నా.. ఎందుకో ఆ పని సాగలేదు.
తాజాగా దువ్వాడ మరోసారి సెంటరాఫ్‌ది టాక్ అయ్యారు. ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈ)పై దువ్వాడ బండ బూతులతో విరుచుకుపడ్డారు. “టెక్కలిలో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా.. నాయాల“ అంటూ.. బూతులతో ఫోన్‌లోనే రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన ఫోన్ సంభాషణ ఇప్పుడు మీడియాకు, సోషల్ మీడియాకు కూడా చేరింది. దీంతో దువ్వాడ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. మరోవైపు.. విద్యుత్ శాఖ ఏఈపైనే ఇలా బండ బూతులతో విరుచుకుపడితే.. తాము ఎలా పని చేస్తామంటూ.. లైన్‌మెన్లు, సిబ్బంది సహాయ నిరాకరణకు దిగారు. ఈ వ్యవహారం ప్రభుత్వానికి కూడా చేరడంతో మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ఏం జరిగిందో విచారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఏం జరిగింది?
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్నారు. అయితే.. ఆయన గత కొన్నాళ్లుగా విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా ఇవి 56 వేల రూపాయల పైచిలుకు మొత్తానికి పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ నుంచి పలు మార్లు నోటీసులు అందాయి. అయినా దువ్వాడ వాటిని పట్టించుకోలేదు. కట్ చేస్తే. ఉన్నతాధికారి(ఏఈ) మురళీకృష్ణ ఆదేశాలతో శుక్రవారం సిబ్బంది విద్యుత్ కనెక్షన్ ను కట్ చేశారు. ఈ విషయం తెలిసిన దువ్వాడ మురళీ కృష్ణకు ఫోన్ చేసి.. ‘‘ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి విద్యుత్ కట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం. ఎవరితో పెట్టుకుంటున్నావ్. కోర్టుకు లాగుతాను. నరకం చూపిస్తా. టెక్కలి నుంచి పారిపోయేటట్టు చేస్తా నాయాల. ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా నాయాల’’ అని రెచ్చిపోయారు.