టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సేవా కార్యక్రమాలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తన మనసుకు నచ్చిన పలు కార్యక్రమాలకు తన సొంత నిధులను వెచ్చిస్తున్న లోకేశ్… గురువారం అవయవదానానికి దన్నుగా నిలిచి ఏకంగా తన సొంత ఖర్చుతో ఓ విమాన సర్వీసును ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి తిరుపతికి ఓ మహిళ గుండెను తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేయగా… అందుకు అవసరమైన విమాన సర్వీసును లోకేశ్ తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే…గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో స్థానిక మహిళ చెరుకూరి సుష్మ గురువారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆమె అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో సుష్మ గుండెను తిరుపతిలో చికిత్స పొందుతున్న తెనాలికి చెందిన వ్యక్తికి అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. ఒకే నగరంలోని రెండు ఆసుపత్రుల మధ్య అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది. మరి రెండు నగరాల మధ్య అవయవాల తరలింపు అంటే… ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే కదా. అవయవ దానం స్వీకరించే వ్యక్తి కుటుంబానికి అంత మొత్తం భరించే స్తోమత లేదు.
అప్పుడే గుంటూరు రమేశ్ ఆసుపత్రి వైద్యులకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే సోషల్ మీడియాలో నారా లోకేశ్ కు ఈ విషయాన్ని వివరిస్తూ ఒక మెసేజ్ పెట్టారు. కేవలం 15 నిమిషాల్లోనే స్పందించిన లోకేశ్… సుష్మ గుండెను తిరుపతికి తరలించేందుకు తాను సాయం చేస్తానని స్పందించారు. వైద్యుల నుంచి వివరాలు సేకరించిన లోకేశ్… గుంటూరు నుంచి విజయవాడ మీదగా గన్నవరం దాకా గ్రీన్ ఛానెల్ ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గన్నవరం నుంచి ఆ గుండెను తిరుపతి తరలించేందుకు అవసరమైన విమాన సర్వీసును పూర్తిగా తన సొంత నిధులతో లోకేశ్ సమకూర్చారు.
ఈ విషయాన్ని గుంటూరు రమేశ్ ఆసుపత్రి వైద్యులు స్వయంగా వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు…లోకేశ్ ఉదారతను అభినందించారు. ఈ తరహా చర్యకు ఉపక్రమించిన లోకేశ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే మంగళగిరిలోని అటవీ శాఖ ఎకో పార్క్ లో పట్టణ ప్రజలకు ఉచిత వాకింగ్ కోసం రూ.5 లక్షల నిధులను వెచ్చించిన లోకేశ్… అటవీ శాఖ కూల్చివేసిన కాశినాయన ఆశ్రమ భవనాలను తన సొంత నిధులతోనే నిర్మించి ఇచ్చిన సంగతి తెలిసిందే.