రాజు తలచుకుంటే… పదవులకు కొదవా?

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నది పెద్దల సామెత. ఇప్పుడు వైసీపీని చూస్తుంటే… ఆ సామెత కాస్తా… రాజు తలచుకుంటే పదవులకు కొదవా? అని చెప్పుకోవాల్సిందే. అసలే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. పార్టీ ఘోర పరాజయాన్ని ముందే ఊహించిన కొందరు ఎన్నికలకు ముందే పార్టీని వీడితే…ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక చాలా మంది నేతలు పార్టీకి దూరమైపోయారు. మరి మిగిలి ఉన్న నేతలనైనా కాపాడుకోవాలి కదా. అందుకే కొత్తగా పదవులను సృష్టించి మరీ నేతలకు కట్టబెడుతున్నారు.

ఎక్కడనా పార్టీకి అధ్యక్షుడి తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, అదికార ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు… ఇలాంటి పదవులు ఉంటాయి. ఇక అనుబంధ విభాగాలకు ఆయా విభాగాల అధ్యక్షులు మాత్రమే ఉంటారు. అయితే ఇప్పుడు వైసీపీ ఓ కొత్త సంస్కృతికి తెర తీసింది. అనుబంధ విభాగాలకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటూ కొత్త పదవులను క్రియేట్ చేసేసింది. ఆయా పదవుల్లో ఒకింత యాక్టివ్ గా ఉండే నేతలకు అప్పజెబుతూ… వారికి పార్టీలో మరింత క్రియాశీలక పాత్ర కట్టబెడుతున్నట్లుగా పదవులు ఇస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పుడు వైసీపీ యువజన విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పేరిట ఓ కొత్త పదవిని క్రియేట్ చేశారు. ఈ పదవిలో రాయలసీమలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా… ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ గా సిద్ధార్థ రెడ్డి పని చేశారు. ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగంలో నాటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటగా సిద్ధార్థపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.