తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆవేశాలు.. ఆగ్రహాలు కామన్‌గా మారిపోయాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి., ప్రతిపక్ష బీఆర్ ఎస్ నాయకులకు మధ్య వాద ప్రతివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా బుధవారం నాటి సభలో ఎన్నికల విషయం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ‘భూభారతి’ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. భూభారతిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారని అన్నారు.
భూభారతిలో అక్రమాలకు అవకాశం లేదని.. ఎవరూ రూపాయి లంచం తీసుకునే ఆస్కారం కూడా లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రజలు భూభారతి విషయంలో ఆసక్తిగా ఉన్నారని.. ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు. భూభారతి అమలు తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డిని రైతులు, ప్రజలు.. దేవుడిలెక్క కొలుస్తున్నారని కూడా మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తాము భూభారతి అజెండాతో ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు అడుగుతామని చెప్పారు.
దీనిపై స్పందించిన బీఆర్ ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీరు అమలు చేస్తున్నది భూ భారతి కాదు.. భూ హారతి” అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. అధికార పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలు చేశారు. మళ్లీ పల్లా కొనసాగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు భూభారతి అడ్డుపెట్టుకుని గ్రామాల్లో వందల ఎకరాల భూములను సొంతం చేసుకుంటున్నారని విమర్శించారు. అందుకే.. తాము భూభారతి కాదు.. హారతి అంటున్నామన్నారు.
ఈ క్రమంలోనే.. “మీరు భూభారతిపై అంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి.. మీరు భూభారతి అజెండాతో ఎన్నికలకు వెళ్తే.. మేం(బీఆర్ ఎస్) ధరణి అజెండాతో ఎన్నికలకు వెళ్తాం. ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూద్దాం” అని పల్లా సవాల్ విసిరారు. దీనిని మంత్రి పొంగులేటి కూడా.. అలాగే వెళ్తామంటూ.. ప్రతిసవాల్ రువ్వారు. దీంతో సభ ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం, సవాళ్లు ప్రతిసవాళ్లతో అట్టుడికింది. ఇదిలావుంటే.. ధరణి కారణంగానే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ ఎస్ నష్టపోయిందన్న వాదన బలంగా వినిపించిన విషయం తెలిసిందే. 2023 ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ ఎస్ తుడిచి పెట్టుకుపోయిన విషయం గమనార్హం.