చంద్ర‌బాబు మాట్లాడితే.. టీవీల‌కు అతుక్కుపోయేవారు: మ‌ల్లారెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. లాబీల్లో మీడియాతో సంభాషించారు. స‌భ జ‌రుగుతుండ‌గా బ‌య‌ట‌కు ఎందుకు వ‌చ్చార‌ని మీడియా మిత్రులు ప్ర‌శ్నించారు. దీనికి మ‌ల్లారెడ్డి స్పందిస్తూ.. “ఏముంటద‌బ్బా.. స‌భ‌లోని. బ‌ట్టలు విప్పుడు-క‌త్తులు దూసుడేగా” అని వ్యాఖ్యానించారు. దీనికి కొన‌సాగింపుగా.. గ‌తంలో నిర్మాణాత్మ‌కమైన చ‌ర్య‌లు జ‌రిగేవ‌న్నారు.

స‌భ‌లో దివంగ‌త వైఎస్‌, ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తుంటే.. టీవీల‌కు అతుక్కుపోయి .. ప్ర‌జలు చూసేవార‌ని మ‌ల్లారెడ్డి చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. ఎవ‌రి పౌరుషాలు వారివి.. వాటిని స‌భ‌లోనే ప్ర‌ద‌ర్శిస్తున్నారు.. అని అన్నారు. “స‌భ‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడాలె. గ‌దేందో.. మా నాయ‌కుల స‌మ‌స్య‌లపైనేకొట్లాడుతున్న‌రు. ఇదేం స‌భ‌!” అని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ స‌ర్కారు ఉన్న‌ప్పుడు.. ఆయ‌న స‌భ‌లో మాట్లాడుతుంటే.. గ్రామాల్లో కూడా టీవీలు పెట్టుకుని చూసేవార‌ని తెలిపారు.

కానీ, ఇప్పుడు ఎవ‌రూ టీవీలుచూడ‌డం లేద‌ని.. పైగా అసెంబ్లీ లైవ్ అంటే టీవీల‌ను బంద్ చేస్తున్నార‌ని మ‌ల్లారెడ్డి చెప్పుకొచ్చారు. “ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో మాత్రం బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే కనిపిస్తోంది. ఇంక ఇంట్ర‌స్ట్ ఏముంటుంది” అని అన్నారు. ఇదేస‌మ‌యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ క‌నిపించ‌గానే.. ఆయ‌న‌ను ఉద్దేశించి కూడా మ‌ల్లారెడ్డి సెటైర్లు వేశారు. ‘నమస్తే మంత్రి గారు’ అని చ‌మ‌త్క‌రించారు.

అంతేకాదు.. “రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ, వివేక్ ఫ్యామిలీదే హవా నడుస్తోంది. మా మాట ఎవ‌డూ ఇంట‌లే” అని మ‌ల్లారెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి ప్ర‌తిగా.. వివేక్ కూడా.. సెటైర్లే వేశారు. మీ పాలన‌లో కేసీఆర్‌-మ‌ల్లారెడ్డిదే హవా న‌డిచిందిగా ! అని అన్నారు. దీంతో మ‌ల్లారెడ్డి గ‌మ్మునుండి పోయారు. ఇదిలావుంటే.. మ‌ల్లారెడ్డి స‌భ‌కు వ‌చ్చినా.. పెద్ద యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం లేదు. ఏదో వ‌చ్చామా.. వెళ్లామా? అన్న‌ట్టే ఉంటున్నారు.