వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మూడేళ్ల తర్వాత.. వచ్చేది మన ప్రభుత్వమే. అప్పుడు మీకు న్యాయం చేస్తా” అంటూ.. పులివెందుల రైతులను ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. అకాల వర్షంతో కుప్పకూలిన అరటి తోటలను పరిశీలించి, రైతులను పరామర్శించిన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలను ఇమిటేట్ చేసిన బుచ్చయ్య చౌదరి.. జగన్‌పై సెటైర్లు వేశారు.
“ఔను.. మూడేళ్ల తర్వాత.. జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకే” అని వ్యాఖ్యానించారు. తాజాగా అమరావతిలో బుచ్చయ్య మీడియాతో మాట్లాడారు. “జగన్ తమ్ముడు.. గురించి నా నోటితో చెప్పలేను” అని వ్యాఖ్యానించిన బుచ్చయ్య.. జైలు వారికి, కోర్టు వారికి బాగా తెలుసునని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారు తప్పకుండా.. జగన్ ను మూడేళ్లు కాదు.. మూడేళ్లలోపే.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారని.. అప్పుడు తానే స్వయంగా స్వాగత ఏర్పాట్లు చేస్తానని బుచ్చయ్య అన్నారు.
మద్యం, ఇసుక కుంభకోణాలు సహా.. జగనన్న లే అవుట్లలో జరిగిన అక్రమాలపై పోలీసులు కూపీ లాగుతున్నారని చెప్పారు. వీటిపై త్వరలోనే నివేదికలు అందుతాయని.. పక్కా ఆధారాలతో కోర్టుల ద్వారా జగన్ ను జైలుకు పంపిస్తామని గోరంట్ల చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 10 మాసాలు కూడా కాకుండానే.. జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుతున్నారని.. ఆయనకు ఇంగితం లేదని..తల్లి చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడని.. రేపు అధికారం ఇస్తే.. ప్రజలను కూడా తరిమేస్తాడని దుయ్యబట్టారు. ఇలాంటి వారు జైలుకు రావడం తప్ప..మరో మార్గం లేదన్నారు.
ఆ విషయంపై తర్వాత..
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై టీడీపీకి, జనసేనకు ఒక స్టాండు ఉందని గోరంట్ల తెలిపారు. “ఎవరు మాత్రం నష్టం జరిగితే ఊరుకుంటారు. ప్రజలు లేందే మేం లేం. ప్రజలకు అన్యాయం జరిగినా.. రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఎవరు మాత్రం చూస్తూ ఉంటారు. డీలిమిటేషన్‌ను జనాభా ప్రాతిపదికన చేయడం సరికాదు. అయితే.. దీనిపై మేం రోడ్డున పడిపోయి.. యాగీ చేయం. ఎక్కడ ఎలా స్పందించాలో .. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు బాగా తెలుసు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం” అని బుచ్చయ్య అన్నారు.