సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం ఆయన అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. పార్టీ పెట్టేస్తున్నా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానంటూ మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న సూపర్ స్టార్.. ఎట్టకేలకు ఈ నవంబరులో ఆ పని చేయబోతున్నారని అంచనా వేస్తున్న సమయంలో అరంగేట్రం చేయకముందే రజినీ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారన్న వార్త అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది.
రజినీ ఇలా ఎలా చేస్తాడు.. ఆయన మరీ అంత పిరికి వాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలామంది. అభిమానులే ఆయనపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కానీ రజినీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చూస్తే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం తప్పేమీ కనిపించదు. రజినీ రాజకీయాల్లోకి వచ్చి విజయవంతం కావాలా.. లేక ఆయన క్షేమంగా ఉండాలా అని అభిమానులు కొంచెం మనసుపెట్టి ఆలోచిస్తే రెండోదానికే ఓటేస్తారు.
రజినీ ఒకటికి రెండుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఒక సందర్భంలో అయితే ఆయన ప్రాణాలు నిలవవేమో అన్న పరిస్థితి తలెత్తింది. అప్పుడే రెండు నెలలకు పైగా సింగపూర్‌లో ఉండి చికిత్స చేయించుకున్నారు రజినీ. అప్పటి పరిస్థితి చూస్తే రజినీ మళ్లీ సినిమాల్లో నటించరేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. అలాంటిది మళ్లీ కోలుకుని సినిమాలు అయితే చేశారు. రాజకీయాల్లోకి రావడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ ఇంతలో కరోనా వచ్చింది. ఈ వైరస్ ధాటికి యుక్త వయసులో ఉన్న వాళ్లు కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. శరీరంలో వేరే సమస్యలు ఉన్న వాళ్లు.. కరోనా బారిన పడితే ప్రాణాలు నిలవడం కష్టంగా ఉంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం ఇలాగే ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు రజినీ రాజకీయాల కోసం జనాల్లోకి వచ్చాడంటే కరోనా సోకకుండా ఉండదు. ఎంత డబ్బున్నా, ఎంత అత్యుత్తమ చికిత్స ఉన్నా.. ఎంతటి వారైనా తేడా వస్తే కరోనాకు బలి కావాల్సిందే అన్నది చాలామంది విషయంలో అనుభవమైంది. కాబట్టి తనకున్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా రజినీ అత్యంత జాగ్రత్తతో ఉంటున్నారు. సినిమా షూటింగ్ కూడా ఆపేశారు. వ్యాక్సిన్ వచ్చి కరోనా ఆనవాళ్లు పోవడానికి ఇంకా ఆర్నెల్లో సంవత్సరమో పడుతుంది. ఈ లోపు తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తాయి.
ఎలాంటి ఫలితాలొస్తాయో తెలియని ఎన్నికల కోసం జనాల్లోకి వెళ్లి కరోనా తెచ్చుకుని తన ప్రాణాల మీదికి వస్తే.. అప్పుడు అభిమానులే తట్టుకోలేరు. అందుకే రాజకీయాల్లో విజయవంతం కావడం కంటే.. మనిషిగా మిగిలి ఉండటం మంచిదని రజినీ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చూసి ఆయన పిరికి వాడు అని కొందరు అనుకుంటే అనుకోవచ్చు కానీ.. ప్రమాదం అని తెలిసి కూడా మృత్యువుకు ఎదురెళ్లడానికి ఇదేమీ సినిమా కాదు కాబట్టి రజినీ నిర్ణయం సరైందనే అనుకోవాలి.