20 ల‌క్ష‌ల ‘బంగారు కుటుంబాలు: ల‌క్ష్యం ప్ర‌క‌టించిన‌ చంద్ర‌బాబు

విజ‌న‌రీ ముఖ్య‌మంత్రిగా పేరున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా మ‌రో కీల‌క ల‌క్ష్యాన్ని ప్ర‌క‌టించారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ‘బంగారు కుటుంబాల‌ను’ త‌యారు చేయాల‌ని నిర్దేశించుకున్న‌ట్టు తెలిపారు. ప్ర‌భుత్వ ప్ర‌తిపాదిత పీ-4(ప‌బ్లిక్‌-ప్రైవేటు-పీపుల్స్‌-పార్ట‌న‌ర్ షిష్‌) ప‌థ‌కాన్ని ఈ ఉగాది నుంచి ప్రారంభిస్తున్న‌ట్టు చెప్పారు. దీనిలో భాగంగా ఏడాది కాలంలో 20 ల‌క్ష‌ల పేద కుటుంబాల‌ను సంప‌న్న కుటుంబాలుగా త‌యారు చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్టు వివ‌రించారు. దీనికి అధికాదాయ వ‌ర్గాలు, ఎన్నారైలు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు.

తాజాగా పీ-4 విధానంపై సీఎం చంద్ర‌బాబు సంబంధిత అధికారుల‌తో స‌మీక్షించారు. పీ-4 విధానాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలిసేలా విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. దీనిలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు ఎన్నారైలు, తెలుగు వారు, సంప‌న్న వ‌ర్గాలు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చేలా ప్రోత్స‌హించాల‌ని సూచించారు. పీ-4ను స‌మ‌ర్ధ‌వంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులకు కూడా త్వ‌ర‌లోనే టార్గెట్లు నిర్ణయించ‌నున్న‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో పేద‌ల‌ను ఇప్ప‌టికే గుర్తించామ‌న్న సీఎం.. వీరి బాద్య‌త‌ల‌ను పూర్తిగా ముందుకు వ‌చ్చే సంప‌న్న వ‌ర్గాల‌కు అందిస్తామ‌ని చెప్పారు.

వారు.. పేద కుంటుబాల‌కు అన్ని విధాలా అండ‌గా నిల‌వాల్సి ఉంటుంద‌న్నారు. ఇలా పేద‌ల‌కు అండ‌గా నిలిచేవారిని మార్గదర్శులుగా ప్ర‌భుత్వం స‌మున్న‌త గుర్తింపు ఇస్తుంద‌న్నారు. అదేవిధంగా సంప‌న్నుల ద్వారా లబ్ధిపొందే కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా వ్యవహరించ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలిపారు. ‘పీ-4’లో భాగంగా.. తొలుత గ్రామ, వార్డు సభలను నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం.. ఈ ప‌థ‌కం కింద‌ లబ్ధిపొందే కుటుంబాల జాబితాను అక్క‌డే ప్ర‌క‌టిస్తారు. అభ్యంత‌రాలు ఏమైనా ఉంటే తీసుకుని జాబితాల‌ను ఖ‌రారు చేస్తారు.

ఆ త‌ర్వాత‌.. ఏడాది కాల వ్య‌వ‌ధిలో తొలి దశలో 20 లక్షల కుటుంబాలకు సంప‌న్నుల నుంచి ప్ర‌యోజ‌నం అందిస్తారు. విద్య‌, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు, రుణాలు ఇలా అన్ని కోణాల్లోనూపేద‌ల‌ను సంప‌న్నుల‌ను చేయ‌డ‌మే పీ-4 ల‌క్ష్యంగా సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. ఏటా 20 ల‌క్ష‌ల మంది పేద కుటుంబాల‌ను సంప‌న్నుల‌ను చేయ‌డం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలనేదే సంకల్పమ‌ని సీఎం ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఉగాది రోజు అమరావతిలో పీ-4 విధానాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్య‌మంత్రి వివ‌రించారు.