‘కేసీఆర్ గురించి తెలిస్తే.. తెలంగాణ కోసం పోరాడేవారు కాదు’

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా బీజేపీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ పాయ‌ల్ శంక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది త‌మ జీవితాల‌ను త్యాగం చేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎవ‌రూ ఆస్తులు సంపాయించుకోలేద‌ని.. ఒక్క కేసీఆర్ త‌ప్ప‌.. అని అన్నారు. అంతేకాదు.. త‌మ జీవితాల‌ను కూడా రాష్ట్రం కోసం వ‌దులుకున్నార‌ని చెప్పారు. కానీ, కేసీఆర్ వంటి వ్య‌క్తులు రాష్ట్రాన్నికుక్క‌లు చింపిన విస్త‌రి మాదిరిగా చేస్తార‌ని అనుకుంటే.. అస‌లు తెలంగాణ కోసం ఎవ‌రూ పోరాటం చేసేవారు కాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా బ‌డ్జెట్ భేటీలో స్పందించిన ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌.. ఆంధ్ర పాల‌కుల‌తో విసుగు చెందిన తెలంగాణ పౌరులు ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఉద్య‌మించార‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ఆస్తులు కూడా వ‌దులుకున్నార‌ని.. అనేక మంది అప్పులు చేసి ఉద్య‌మాలు నిర్మించార‌ని.. ఈ విష‌యం త‌న‌కు ప్ర‌త్య‌క్షంగా వీక్షించిన‌ట్టు తెలిపారు. అదేవిధంగా చాలా మంది కుటుంబాల‌ను కూడా వ‌దులుకున్నార‌ని తెలిపారు. మ‌రికొంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను కూడా వ‌దులుకుని రాష్ట్ర ఉద్య‌మంలో పాలు పంచుకున్న‌ట్టు చెప్పారు.

కానీ, కేసీఆర్‌.. ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. వారి ఆశ‌ల‌ను చిదిమేశార‌ని.. రాష్ట్రాన్ని త‌న 10 సంవ‌త్స‌రాల ఏలుబ‌డిలో స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని అన్నారు. అందుకే.. ఈ విష‌యాన్ని ఉద్య‌మ‌కారులు క‌నుక ముందుగానే ఊహించుకుని ఉంటే.. అస‌లు రోడ్డెక్కేవారు కూడా కాద‌ని.. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాడే వారు కూడా కాద‌ని అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి, కేసీఆర్ ప్ర‌భుత్వానికి పెద్ద‌గా తేడా లేద‌న్నారు. ప్ర‌శ్నించే వారిపై కేసులు పెడుతున్నార‌ని.. ప్ర‌శ్నించ‌డ‌మే త‌ప్ప‌న్నట్టుగా నాడు, నేడు కూడా పాల‌న సాగుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. దీంతో ఉద్య‌మ‌కారులు.. తెలంగాణ కోసం ఎందుకు పోరాడామా? అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ని.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.