ఇటీవల కాలంలో ఏపీలో పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. పులివెందుల వైసీపీకి వీర విధేయుడిగా.. దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా ఆయన తీరు ఉంది. తనతో పాటు తన తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న వారి బండారాన్ని బయటపెడతానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఈ వైనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
‘హత్య’ మూవీలో తనను.. తన తల్లిని అవమానించేలా సన్నివేశాల్ని ఉంచటంపై సునీల్ యాదవ్ రగిలిపోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే హత్య చిత్ర దర్శక నిర్మాతతో పాటు.. రచయితలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై కడప జిల్లా ఎస్పీని కలిసి.. కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వారిపై కేసు నమోదైంది.
వైఎస్ అవినాష్ రెడ్డి అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సప్ గ్రూపులో ఈ చిత్రంలోని సన్నివేశాలను పోస్టు చేసి.. వైరల్ చేస్తున్నట్లుగా తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. తన కుటుంబం కోసం 39 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నానని.. ఆ సమయంలోనే తన తండ్రిని కోల్పోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. తన వారి వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే వారి బండారాన్ని బయటపెడతానని చెబుతున్న ఆయన.. మాటలతో పులివెందుల వైసీపీ వర్గాల్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
సునీల్ యాదవ్ ఇచ్చిన కంప్లైంట్ కేసుగా మారటమే కాదు.. తదనంతర పరిణామాలు చాలా వేగంగా కదులుతున్నాయి. సునీల్ ఫిర్యాదులో పేర్కొన్న వాట్సప్ గ్రూపు ఆడ్మిన్ గా వ్యవహరిస్తున్న పవన్ కుమార్ ను ఈ కేసులో ఏ1గా పేర్కొన్నారు. వైసీపీ కడప సోషల్ మీడియా వాట్సప్ గ్రూప్ ఆడ్మిన్ ను ఏ2గా చేర్చారు. వీరితో పాటు మరికొందరిని కూడా నిందితులుగా పేర్కొంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పవన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని.. కడప సైబర్ క్రైమ్ స్టేషన్ లో విచారించటమే కాదు.. పులివెందులకు తరలించారు. పవన్ ను అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.