రాజకీయ నాయకులు పంతం పడితే..కానిదేముంది? పైగా అధికారంలో ఉన్న పార్టీ పట్టుబడితే సాధ్యం కానిది అంటూ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అదే జరుగుతోంది కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో!. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన పంతం నానాజీ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కారు. వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఆయన చిత్తుగా ఓడించి.. విజయం సాధించారు. ఇక, ఆ తర్వాత.. కొన్నాళ్లు మౌనంగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం విజృంభిస్తున్నారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీని కదిలించడంతోపాటు..జనసేనకు పునాదులు బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పంతం నానాజీ.. నిజంగానే పంతం పట్టారు. ఈ క్రమంలో కాకినాడ మండల ప్రజా పరిషత్‌లో జనసేన జెండా ఎగరేయాలన్నది ఆయన లక్ష్యం. తద్వారా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలి స్థానిక సంస్థను జనసేనకు సొంతం చేసిన ఘనతను సాధించాలని నానాజీ భావిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా నానాజీ వేగవంతం చేశారు. 2021లో జరిగిన ఎన్నికల్లో కాకినాడ రూరల్ లో వైసీపీ పట్టు బిగించింది.
అప్పటి మంత్రి కన్నబాబు.. ఎంపీపీని వైసీపీ పరం చేసేలా చక్రం తిప్పారు. దీంతో కాకినాడ రూరల్ మండల ప్రజాపరిషత్‌లో మొత్తం సభ్యులు 18 మంది ఉండగా.. 15 వైసీపీ తరఫున గెలిచారు. కేవలం ముగ్గురు మాత్రమే జనసేన మద్దతుతో విజయం దక్కించుకున్నారు. అప్పట్లో జనసేన తరఫున గెలిచిన వారిని వైసీపీలోకి చేర్చుకోవాలని భావించినా.. సాధ్యం కాలేదు. ఇంతలో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలింది. ఇక, ఇప్పుడు నానాజీ.. తన విశ్వరూపం ప్రదర్శించి.. 15 మంది వైసీపీ ఎంపీపీలలో ఆరుగురిని తన వైపు తిప్పేసుకున్నారు. వీరికి తాజాగా జనసేన కండువా కప్పేశారు.
ఎంపీటీసీ సభ్యులు బందిలి విరీష(వైస్ ఎంపీపీ), గుత్తుల సత్తిబాబు(వైస్ ఎంపీపీ), వాసంశెట్టి సత్యవతి, కేతా సూర్యచంద్ర, గత్తుల శ్రీను, మామిడాల నాగచక్రంలు తాజాగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రజాపరిషత్‌లో జనసేన బలం 9కి చేరింది. వైసీపీ బలం కూడా 9గానే ఉంది. అయితే.. ఒకరు రాజీనామా చేశారు. దీంతో.. జనసేన ఇక్కడ చక్రం తిప్పాలంటే.. ఒక్క అభ్యర్థి ఇటు గూటికి చేరితే చాలు. ఈ దిశగానే నానాజీ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. అంటే.. ప్రస్తుతం ఉన్న కోరం ప్రకారం.. జనసేనకు 10 మంది ఎంపీపీలు దక్కితే ఇక్కడ మండలాధ్యక్ష స్థానం జనసేన సొంతం అవుతుంది. ఇదే జరిగితే.. తూర్పు స్థానికంలో జనసేన జెండా ఎగిరినట్టేనని అంటున్నారు పరిశీలకులు.