ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు వెళ్లేది లేదని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ భీష్మించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా మనసులో ఏమున్నా.. వారు కూడా సభకు డుమ్మా కొడుతున్నారు. అధినేత గీసిన గీతను దాటితే.. ఏం జరుగుతుందోనన్న భయం కొందరిని వెంటాడుతుంటే.. మరికొందరు వీరవిధేయులు జగన్ వెంటే తాము ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా 11 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు. ఇదిలావుంటే.. ఈ వ్యవహారం పార్టీ పరంగా ఎలా ఉన్నా.. ప్రజల కోణంలో మాత్రం కలకలం రేపుతోంది.
ఇప్పటికి ఎన్నికలు జరిగిన దాదాపు 11 నెలలు అయిపోయింది. రాష్ట్రంలో కూటమి సర్కారు కొలుదీరి 10 మాసాలు పూర్తవు తోంది. ఇక, ఇప్పటికి మూడు సార్లు సభలు జరిగాయి. తొలిసారి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పట్లో జగన్ హాజరయ్యారు. ప్రమాణం చేసి వచ్చారు. ఆ తర్వాత మధ్యంతర బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అప్పట్లో.. తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరైన జగన్.. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను ప్రశ్నిస్తూ..నల్లరిబ్బన్లతో నిరసన ప్రదర్శన చేసి వెనుదిరిగి వచ్చారు. ఆ తర్వాత.. మళ్లీ సభకు వెళ్లలేదు.
ఇక, తాజాగా 2025-26 బడ్జెట్ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టారు. తొలిరోజు వెళ్లినా.. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఈ సమయంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. ఇక, ఆ తర్వాత.. సభ జరి గినన్ని రోజులు జగన్ కానీ, ఆయన పార్టీ సభ్యులు కానీ.. సభ వైపు కన్నెత్తి చూడలేదు. అయితే.. ఇప్పటికి రెండు సార్లు సభకు వెళ్లినా.. ప్రజల సమస్యలపై జగన్ స్పందించలేదు. తొలిసారి పార్టీ కార్యకర్తలు, నాయకుల గురించి ప్రస్తావించారు. తాజాగా తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ పరిణామాలు ఇప్పుడు జనసామాన్యంలో చర్చకు వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్తున్నప్పుడు.. వారు ఇదే ప్రశ్నలు సంధిస్తున్నారు. సభకు ఎందుకు వెళ్లడం లేదని వారు నిలదీస్తున్నారు. అంతేకాదు.. తాము ఓటేసి గెలిపించిన తర్వాత.. తమ సమస్యలు పరిష్కరించకపోతే.. ఇంకెందుకని.. ప్రశ్నిస్తున్నారు. ఈ జాబితాలో జగన్ సహా కొందరు సీనియర్‌లను పక్కన పెడితే..జూనియర్లు, తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు. దీంతో వారు ప్రజలకు సమాధానం చెప్పలేక.. తమను తాము సమర్ధించుకోలేక తల్లడిల్లుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.