తెలంగాణలో ప్రదాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన ప్రకటన చేశారు. గురువారం సూర్యాపేట వెళ్లిన కేటీఆర్.. నిర్దేశిత కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత అక్కడే మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల తరాన్నిపాత తరంగా పరిగణిస్తే… వారిలో తొలి ఇద్దరు నేతల కుమారులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేశ్ లు తమ తండ్రుల మాదిరే పాదయాత్రలు చేపట్టి తమ పార్టీలను అదికారంలోకి తీసుకువచ్చినస సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ పాదయాత్ర చేస్తే… యువగళం పేరిట లోకేశ్ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రల ద్వారా వీరిద్దరూ వారు అనుకున్న లక్ష్యాలను చేరారు.
తాజాగా జగన్, లోకేశ్ ల బాటలోనే సాగుతున్నట్లుగా కేటీఆర్ ప్రకటన ఉందన్న వాదన వినిపిస్తోంది. దేశంలోనే పాదయాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్త యాత్రలకు వైఎస్సార్ శ్రీకారం చుడితే… దానిని చంద్రబాబు కూడా అనుసరించారు. అయితే కేసీఆర్ మాత్రం పాదయాత్ర లాంటివేమీ చేయలేదు. వైఎస్సార్, చంద్రబాబు మాదిరిగా వారి కుమారులు కూడా పాదయాత్రలతో సక్సెస్ మంత్రాన్ని అందుకున్నారు. మరి పాదయాత్ర జోలికి వెళ్లకుండానే అధికారంలోకి వచ్చేసిన కేసీఆర్.. వరుసగా రెండు సార్లు సీఎంగా పదవిని అనుభవించారు.
కేసీఆర్ రెండో సారి సీఎంగా అయిన తర్వాత పార్టీలో కేసీఆర్ తర్వాతి స్థానం తనదే అని నిరూపించుకున్న కేటీఆర్…పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొత్త బాద్యతలు చేపట్టారు. పురపాలక,ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా ఉన్నా… ఇతర శాఖల్లోనూ కేటీఆర్ కలుగజేసుకుని పాలనపై పట్టు సాధించారు. మరి తానపు చేపట్టే పాదయాత్ర కేటీఆర్ కు కలిసి వస్తుందో, లేదో చూడాలంటే.. 2028 వరకు వేచి చూడాల్సిందే.