రాజకీయాల్లో నాయకుల ప్రతిభ, ఎత్తులు పై ఎత్తులు.. ఎన్ని ఉన్నా చివరాఖరుకు.. సామాజిక వర్గాల దన్ను, వారి మద్దతు లేకుండా రాజకీయాలు చేయలేరన్న విషయం తెలిసిందే. ఆది నుంచి పరిస్థితి ఎలా ఉన్నా.. గత 20 ఏళ్ల రాజకీయాలను చూసుకుంటే.. ఏపీలో సామాజిక వర్గాల బలం ఎటు వైపు ఉంటే ఆ పార్టీనే అధికారం దక్కించుకుంటున్న పరిస్థితిఉంది. ఎన్నికల సమయంలో ఆయా వర్గాలు నేతల తలరాతలను నిర్ణయిస్తున్నాయి.
అందుకే.. ఎవరిని ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ.. సామాజిక వర్గాలను లాలించక.. ప్రేమించక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో గత ఎన్నికల సమయంలో కాపుల వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. 2019 ఎన్నికల్లో కాపులు టీడీపీకి వ్యతిరేకంగా మారారు. అలాగని.. కాపు నాయకుడు స్థాపించిన జనసేన వైపు కూడా పెద్దగా మొగ్గు చూపలేదు. నేరుగా వైసీపికి అనుకూలంగా పనిచేశారు. కానీ, 2024కు వచ్చేసరికి మాత్రం గుండుగుత్తగా జనసేనకు మద్దతు పలికారు.
అంటే.. 2019లో తమకు మద్దతుగా ఉన్న కాపులు.. గత ఎన్నికల్లో వైసీపీకి దూరమయ్యారనే విషయం జగన్ గ్రహించారు. ఈ నేపథ్యంలో కాపులను మచ్చిక చేసుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మానేశారు. గత ఎన్నికల సమయంలో పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ఫలితంగానే కాపులు దూరమయ్యారన్న వాదన ఉంది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో పవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మానేశారు.
అంతేకాదు.. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను మండలికి పంపించారు. ప్రతిపక్షనాయకుడిగా కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే.. ఇలా ఎన్ని చేసినా కాపుల నుంచి పెద్దగా స్పందన వైసీపీ వైపు కనిపించడం లేదు. అంతేకాదు.. కాపు నాయకుడు ఆళ్ల నాని పార్టీ నుంచి దూరం కావడం ఆయనను కనీసం బుజ్జగించకపోవడం వంటి పరిణామాలు కాపులను దూరంగానే ఉంచాయన్న చర్చ ఉంది. ఇప్పటికి ఉన్న అంచనాల ప్రకారం.. వైసీపీకి కాపులు ఇప్పట్లో మొగ్గు చూపే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు కీలక కాపు నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు.