టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దార్శనికత ఏ పాటితో ఆయా అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు తెలిసి వస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. దళితుల్లో రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు ఇవ్వగా..ఆ తీర్పును అనుసరించి రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చర్యలు చేపట్టాయి. ఇందులో బాగంగా గురువారం ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరగ్గా…ఈ చర్చలో ఉత్సాహంగా పాలుపంచుకున్న జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం చంద్రబాబు దార్శనికతకు నిజంగానే అద్దం పట్టిందని చెప్పక తప్పదు.
తెలంగాణ రాజధాని మొన్నటిదాకా జంట నగరాల సమాహారమే. అయితే ఐటీని అభివృద్దికి బీజం వేసిన చంద్రబాబు… ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ లో సైబరాబాద్ అనే మరో కొత్త నగరానికి రూపాన్నిచ్చారు. ఈ అంశాన్నిగుర్తు చేసిన పవన్.. చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్తే కాదు… ఎస్సీ వర్గీకరణ రూపశిల్పి కూడా అని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. నిజమే మరి… సైబరాబాద్ ను అభివృద్ది చేయడమే కాకుండా… ఎస్సీ వర్గీకరణను 1997లోనే అమలు చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనని చెప్పాలి. అయితే నాడు చంద్రబాబు సర్కారు చేసిన వర్గీకరణను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది.
ఆ తర్వాత దానిపై అధ్యయనం కోసం ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పేసింది. అంటే…1997లో చంద్రబాబు చేసిన వర్గీకరణ కరెక్టేనని కోర్టు చెప్పినట్టే కదా. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ సాగిన పవన్… చంద్రబాబు దార్శనికతను విడమరచి మరీ చెప్పిన తీరు ఆకట్టుకుంది. దళితుల ఆత్మ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లి.. ఉమ్మడి రాష్ట్రంలోనే వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. మంద కృష్ణ మాదిగ ఈ ఉద్యమానికి ఆద్యుడిగా నిలిస్తే… చంద్రబాబు ఉద్యమానికి ఆది నుంచి వెన్నుదన్నుగా నిలిచిన నేతగా రికార్డు సృష్టించారని పవన్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates