ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు: కోర్టు సంచలన తీర్పు!

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీష్‌రావుకు భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై న‌మోదైన ఎఫ్ ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఫోన్‌ట్యాపింగ్ కేసులో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి చ‌క్ర‌ధ‌ర్ గౌడ్‌.. హ‌రీష్ రావుపై ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో పోలీసులు హ‌రీష్‌రావును ఏ1గా పేర్కొంటూ గ‌తంలో కేసు న‌మోదు చేశారు. అయితే.. ఈ కేసును కొట్టి వేయాల‌ని.. రాజ‌కీయ క‌క్ష సాధింపుల క్ర‌మంలోనే త‌న‌పై కేసు న‌మోదైంద‌ని పేర్కొన్నారు.

ఈ కేసులో హ‌రీష్ రావుతోపాటు రాధాకిష‌న్ రావుపైనా పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం.. ఇరువురిపైనా ఎఫ్ ఐఆర్‌లు న‌మోదు చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఏ ఆధారాల‌తో కేసు న‌మోదు చేశార‌ని ప్ర‌శ్నించింది. దీనికి కొంత స‌మ‌యం కావాల‌ని పోలీసుల త‌ర‌ఫున న్యాయ‌వాది కోర్టును కోరారు. అయితే.. ఆధారాలు లేకుండా ఎఫ్ ఐఆర్ న‌మోదు చేయ‌డం స‌రికాద‌ని పేర్కొంటూ కోర్టు స‌ద‌రు ఎఫ్ ఐఆర్‌ను కొట్టి వేసింది.

బీఆర్ ఎస్ హ‌యాంలో 2023 ఎన్నిక‌ల‌కుముందు ప్ర‌ముఖ నాయ‌కులు, ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫోన్ల‌ను ట్యాపింగ్ చేశార‌న్న ఫిర్యాదులు వ‌చ్చాయి. దీనిలో నేరుగా పోలీసుల ప్ర‌మేయం ఉంద‌న్న వాద‌న కూడా వినిపించింది. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించిన రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ప‌లువురు అధికారుల‌పై కేసులు న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయ నేత‌ల ప్ర‌మేయం కూడా ఉంద‌ని తెలియ‌డంతో వారిపైనా కేసుల న‌మోదుకు ఆదేశించింది. ఈ క్ర‌మంలోనే చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ ఆరుమాసాల కింద‌ట హ‌రీష్ రావు స‌హా.. రాధాకిష‌న్‌రావుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.