ఏపీలో వైసీపీ గత పాలనకకు, కూటమి ప్రస్తుత పాలనకు స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోంది. అది కూడా ఈ 9 నెలల కూటమి పాలనలోనే సదరు విభజన రేఖ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రత్యేకించి ప్రభుత్వ పాలనలో సలహాలు, సూచనలు ఇచ్చే కీలకమైన ప్రభుత్వ సలహాదారుల నియామకంలో ఈ విషయం మరింత విస్పష్టంగా కనిపిస్తోందని చెప్పక తప్పదు. గతంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారే అర్హులుగా కనిపించగా… ప్రభుత్వ సలహాదారులంతా ఆవర్గానికి చెందిన వారే ఉండేవారు. కానీ కూటమి పాలనలో ఆయా రంగాల్లో నిష్ణాతులుగా యావత్తు దేశంలోనే ప్రశంసలు అందుకున్న వారు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులు అవుతున్నారు. ఫలితంగా నాడు అడ్వైజర్ పదవులన్నీ రాజకీయ పునరావాసానికి పరిమితం కాగా… నేడు ఆ పదవులు రాష్ట్ర పురోభివృద్దికి మాత్రమే దోహదం చేయనున్నాయని చెప్పాలి.
వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవుల్లో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ ను ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయా రంగాల్లో టెక్నాలజీని వినియోగించే విషయంలో ఈయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. ఇక డీఆర్ఢీఓ మాజీ చైర్మన్ గా చాలా కాలం పాటు పనిచేసిన సతీశ్ రెడ్డిని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్ గా, ఫోరెన్సిక్ సైన్స్ కు కేపీసీ గాంధీ, హ్యాండ్ లూమ్స్ హబ్ కు సుచిత్రా ఎల్లా సలహదారులుగా నియమితులయ్యారు. ఈ నలుగురు ప్రముఖులను కేబినెట్ హోదాలో సలహాదారులుగా ప్రభుత్వం నియమించింది.
సోమనాథ్, సతీశ్ రెడ్డిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక సుచిత్రా ఎల్లా విషయానికి వస్తే.. కరోనా ముప్పులో వ్యాక్సిన్ ను తయారు చేసి ప్రపంచ మానవాళికి ప్రాణాలు పోసిన భారత్ బయోటెక్ వైస్ చైర్మన్ గా ఆమె వ్యవహరిస్తున్నారు. టీటీడీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. హ్యాండ్ లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ రంగాల్లో ఆమె సలహాలు రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ గా సుదీర్గ కాలం పాటు పనిచేసిన గాంధీ.. ఆ రంగంలో విశేష అనుభవం గడించారు. ఆదునిక కాలంలో ఫోరెన్సిక్ సైన్స్ కు ఎనలేని ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ సేవలు అటు దర్యాప్తు సంస్థలతో పాటుగా ఇటు నిరుద్యోగ యువతకు ఉభయతాకరంగా మారనున్నాయని చెప్పాలి. ఈ నలుగురు రెండేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు.
ఇక ప్రభుత్వ సలహాదారుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తంతును గుర్తు చేసుకుంటేనే… వ్యవస్థలు ఎంతగా భ్రష్టు పట్టాయన్న విషయం భీతిగొలుపుతుంది. సకల శాఖల మంత్రిగా విపక్షాల చేత పిలిపించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు పాలనా అనుభవమే లేదు. ఓ జర్నలిస్టు అయిన ఆయన ఏకంగా ఐదేళ్ల పాటూ సలహాదారుగా కొనసాగారు. ఐటీ సలహాదారుగా నియమితులైన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి…మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయారు. ప్రస్తుతం సాక్షి పత్రికకు ఎడిటర్ గా పనిచేస్తున్న ధనుంజయ్ రెడ్డి కూడా కొంతకాలం పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆయన ఏ రంగంలో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారో కూడా తెలియలేదు. వందల మంది సలహాదారులను నియమించిన నాటి ప్రభుత్వం… అందులో అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే తీసుకుంది. మిగిలిన వర్గాలకు చెందిన వారిలో కేవలం సాక్షి మీడియాలో పనిచేసిన విషయాన్నే అర్హతగా తీసుకుందన్నఆరోపణలు వినిపించాయి.