మ‌ర‌క మంచిది కాదు.. జ‌గ‌న్ తెలుసుకోవాలి!

జ‌గ‌న్‌ను గెలిపించింది ఇందుకేనా? ఇలా అయితే.. 30 ఏళ్లు కాదు క‌దా.. మూడేళ్లు కూడా క‌ష్ట‌మే!!- ఈ మాట అంటోంది ఎవ‌రో టీడీపీ నేత‌లు.. జ‌గ‌న్ అంటే గిట్ట‌ని ప్ర‌త్య‌ర్ధి వ‌ర్గం నాయ‌కులు ఏమాత్రం కాదు. వైసీపీ సానుభూతిప‌రులు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకున్న తెర‌చాటు పెద్ద‌లే!! ఒకింత ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది ముమ్మాటికీ వాస్తవం. ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ ఏం చేసినప్ప‌టి కీ స‌హించిన కొంద‌రు వైసీపీ సానుభూతిప‌రులు.. ఇప్పుడు ఇక‌, మాట‌ల‌ను క‌ట్ట‌డి చేసుకోలేక పోతున్నారు. ప్ర‌త్య‌క్షంగా అన‌లేక‌.. ప‌రోక్షంగా ఓ వ‌ర్గం మీడియా ముందు మ‌న‌సు విప్పుతున్నారు.

ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌లు చేయాల్సిందే. కానీ, దీనికి కూడా ఒక హ‌ద్దు ఉంటుంది. మ‌నం ఏం చెబితే అది న‌మ్మే ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు లేరు. నేటి యువ‌త అస‌లే లేదు. మ‌న మాట‌లు మ‌న‌కుకొండంత అండ‌. ఈ విష‌యాన్ని మా నాయ‌కుడు మ‌రిచిపోతున్నారు. 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. వ‌చ్చే మూడేళ్లు కూడా ప్ర‌జ‌ల‌కు భార‌మై పోతున్నారు. ఈ త‌ర‌హా ఆలోచ‌న ప్ర‌జ‌ల్లో ఇప్పుడు ప్రారంభ‌మైంది. దీని నుంచి ఎవ‌రూ ఆయ‌న‌ను ర‌క్షించ‌లేరు– ఇదీ ఇప్పుడు వైసీపీ సానుభూతి ప‌రులు చేస్తున్న వ్యాఖ్య‌లు. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? ఎందుకు ఇంత‌గా వ్య‌తిరేక‌త పెల్లుబుకుతోంది? అని ఆరాతీస్తే.. తాజాగా పోల‌వ‌రం విష‌యంలో స‌ర్కారు చేసిన వ్యాఖ్య‌లేన‌ని తెలుస్తోంది.

చంద్ర‌బాబు చేసిన పాపం వ‌ల్లే.. పోల‌వ‌రం ఆగిపోయింది. ఆయ‌న ఆనాడు 23 వేల కోట్ల అంచ‌నాకే దీనిని ఒప్పుకొన్నారు. అందుకే ఇప్పుడు మేం దీనికి అంగీక‌రించ‌క‌త‌ప్ప‌డం లేదు. ఇదంతా కూడా బాబు పాప‌మే.. మ‌న‌కు శాప‌మే! అంటూ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ వ్యాఖ్యానించారు. ఇది నిజ‌మే అనుకుందాం.. ఆయ‌న త‌ప్పులు చేశార‌నే అనుకుందాం.. మ‌రి మీరేం చేశారు? ప‌్ర‌జ‌లు మీకెందుకు అధికారం అప్పగించారు. గ‌త స‌ర్కారు చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుతార‌నే క‌దా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే మంత్రి కానీ, నాయ‌కుడు కానీ క‌నిపించ‌డం లేదు.

గ‌త స‌ర్కారు త‌ప్పుల‌ను ఎత్తి చూప‌డం మంచిదే అయినా.. మేమేమీ చేయ‌లేమ‌ని చేతులు ఎత్తేయ‌డం.. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నానికి భారీ గండి కొట్టుకోవ‌డ‌మేన‌నేది మేధావుల మాట‌. త‌ప్పులే చేశారో.. ఒప్పులే చేశారో.. నాడు బాబు పాల‌న‌ను ప‌క్క‌న పెట్టి.. వైసీపీకి ప్ర‌జ‌లు అధికారం ఇచ్చారు. సో.. ఇప్పుడు బాధ్య‌త వ‌హించి.. ఒక‌వేళ అప్ప‌ట్లో త‌ప్పులు జ‌రిగి ఉంటే స‌రిదిద్దాల్సిన అవ‌స‌రం.. రాష్ట్రాన్ని ముందుకు న‌డిపించాల్సిన అవ‌స‌రం వైసీపీపై ఉంది. కానీ, ఇలా చేతులు ఎత్తేసి.. త‌ప్పులు మావి కావ‌ని త‌ప్పించుకుంటే.. బాబు చేసిన త‌ప్పుల‌క‌న్నా ఎక్కువ త‌ప్పులు ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్నార‌నే చెప్పాలి.

రేపు ఇదే మిష‌తో.. ప్ర‌త్యేక హోదాకు కూడా నీళ్లు వ‌దిలేయ‌ర‌నే గ్యారెంటీ ఏముంటుంది? ఇప్ప‌టి వ‌ర‌కు ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు. ఎన్నిక‌ల‌కు మ‌రో మూడేళ్ల గ‌డువు ఉంది కాబ‌ట్టి.. ఈ విష‌యాన్ని(ప్ర‌త్యేక హోదా) అడుగుతున్నాం .. అంటున్నారు. రేపు ఎన్నిక‌లు వ‌చ్చాక‌.. నాడు బాబు ప్యాకేజీకి ఒప్పుకొన్నారు.. సో.. మేం హోదా తేలేక పోతున్నాం.. అని అప్పుడు కూడా చేతులు ఎత్తేస్తారు క‌దా?! ఇదా.. వైసీపీ నిర్వాకం? ఇందుకేనా ప్ర‌జ‌లు అఖండ మెజారిటీ క‌ట్ట‌బెట్టింది? జ‌గ‌న్‌కు ఇప్పుడు అత్యవ‌స‌రంగా కావాల్సింది.. ఆత్మ ప‌రిశీల‌న‌. వేగంగా తెలుసుకోవాల్సింది ప్ర‌జానాడి. ఈ రెండు విష‌యాల‌ను ఆయ‌న లైట్ తీసుకుని.. కేవ‌లం ప్ర‌తిప‌క్షంపై ఆరోప‌ణ‌లు చేయ‌డం.. టీడీపీని బూచిగా చూపించి కాలం గ‌డ‌పాల‌ని అనుకోవ‌డం వంటి మొద‌టికే ఎస‌రు తెస్తాయ‌న‌డంలో సందేహం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు.