వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు. 2019 ఎన్నికలకు ముందు నిత్యం జనంలోనే ఉండిపోయిన ఆయన… 2019 ఎన్నికల్లో అధికారం చేతికి అందడంతోనే జనానికి దూరమైపోయారు. ఫలితంగా ఐధేళ్లు తిరక్కుండానే… జగన్ అధికారం నుంచి దిగిపోయారు.151 సీట్లున్న వైసీపీ కేవలం 11 సీట్లకు పడిపోయిందంటే.. జగన్ పరాజయం ఏ రేంజిలో ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. రాజకీయాలన్నాక విజయం, పరాజయం కామనే కదా. మరి జగన్ తిరిరి లేచేదెలా? తిరిగి ప్రజలకు దగ్గరవడమే ఉత్తమం అన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. అందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ మాదిరిగా ప్రజా దర్బార్ నిర్వహణ దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు.
2019 ఎన్నికల్లో నారా లోకేశ్ మంత్రి హోదాలోనే ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి పరిధిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలన్న దిశగా ఆయన మంగళగిరిని ఎంచుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో లోకేశ్ కు పరాజయం స్వాగతం చెప్పింది. అయినప్పటికీ… నిరాశ చెందని లోకేశ్ తనదైన శైలి వ్యూహంతో మంగళగిరి జనాల్లోకి చొచ్చుకుని వెళ్లారు. ప్రజా ప్రతినిధిగా లేకున్నా కూడా నిత్యం మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రతి గ్రామాన్ని సందర్శించారు. ప్రతి కుటుంబాన్నీ ఆయన కలిశారు. ఇందుకోసం ప్రజా దర్బార్ పేరిట లోకేశ్ చేపట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కరణ ఆయనను జనానికి మరింతగా చేరువ చేసింది. ఇదే లోకేశ్ కు మొన్నటి ఎన్నికల్లో రికార్డు మెజారిటీ విజయాన్ని కట్టబెట్టింది. అధికారంలోకి వచ్చినా లోకేశ్ ప్రజా దర్బార్ ను కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద కొత్తగా కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను చూస్తుంటే.. ప్రజా దర్బార్ తరహా కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ మద్దతుదారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. త్వరలోనే జగన్ ప్రజా దర్బార్ పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారని… ఇందులో ప్రజల నుంచి జగన్ ఫిర్యాదులను స్వీకరిస్తారని, వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తారని వారు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏదో కొన్ని రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా జగన్ అందుబాటులో ఉన్న అన్ని రోజుల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం గతంలో తన నివాసం చుట్టూ భారీ కంచెను ఏర్పాటు చేసుకున్న మాదిరిగానే…ప్రజా దర్బార్ కు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్న ఫొటోలు వైరల్ గా మారిపోయాయి.