ఇక‌, మిథున్‌రెడ్డి వంతు..

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని న్యాయ‌స్థానాన్ని అభ్య‌ర్థించారు. త‌న‌పై అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని.. త‌న పేరును ప‌త్రిక‌లు కూడా పేర్కొన్నాయ‌ని ఆయ‌న త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. త‌న‌కు ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం పెట్టిన కేసుతో ఎలాంటి సంబంధం లేద‌న్నారు. తాను పార్ల‌మెంటు స‌భ్యుడిన‌ని.. త‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాప‌ర‌మైన నిర్ణ‌యాల‌తో సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. కానీ, గ‌త వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న విధానప‌ర‌మైన నిర్ణ‌యాల్లో తాను జోక్యం చేసుకున్న‌ట్టు కేసు పెట్టార‌ని.. ఈ నేప‌థ్యంలో త‌న‌ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవ‌కాశం ఉన్నందున త‌న‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరారు.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో ఏపీలో మ‌ద్యాన్ని ప్ర‌భుత్వ‌మే విక్ర‌యించింది. ప్ర‌త్యేక దుకాణాలు పెట్టి.. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే మ‌ద్యాన్ని అమ్మారు. అయితే.. పేరొందిన బ్రాండ్ల‌ను ప‌క్క‌న పెట్టి లోక‌ల్ బ్రాండ్లను విరివిగా ఉత్ప‌త్తి చేసి.. ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాటం ఆడార‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో వైసీపీ హ‌యాంలో ఉత్ప‌త్తి అయిన మ‌ద్యం బ్రాండ్లు, వాటి అమ్మ‌కాలు, వ‌చ్చిన లాభాలు.. వ్య‌త్యాసం.. వంటి కీల‌క అంశాల‌పై.. విచార‌ణ‌కు ఆదేశించింది. విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర్ బాబు నేతృత్వంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం మూడు మాసాల్లో నివేదిక ఇవ్వాల‌ని.. బాధ్యుల‌ను అరెస్టు చేయాల‌ని విశేష అధికారాలు క‌ట్ట‌బెట్టింది.

ప్ర‌స్తుతం ఈ కేసుపై విచార‌ణ జ‌రుగుతోంది. అయితే.. ఈ విచార‌ణ తాలూకు వ్య‌వ‌హారం.. ప‌లు ప‌త్రిక‌ల్లో క‌థ‌నాల రూపంలో వ‌చ్చింది. పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన ప‌లు డిస్ట‌రీల నుంచి నాశిర‌కం మ‌ద్యం ఉత్ప‌త్తి చేసి, ప్ర‌భుత్వం ద్వారా భారీ ధ‌ర‌ల‌కు విక్ర‌యించార‌ని పోలీసులు గుర్తించారు. ఈ క్ర‌మంలో ఆయా డిస్ట‌రీలు.. మిథున్ రెడ్డి కుటుంబ స‌భ్యుల పేర్ల‌తో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. మ‌ద్యం అవకతవకలపై ఇప్ప‌టికే న‌మోదు చేసిన ఎఫ్ ఐఆర్‌లో కొంద‌రి పేర్ల‌ను కూడా అధికారులు పేర్కొన్నారు. అదేస‌మ‌యంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్. సత్యప్రసాద్ ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లోనూ.. మిథున్ రెడ్డి స‌హా .. కొంద‌రు వైసీపీ నాయ‌కుల పేర్ల‌ను ప్ర‌స్తావించారు.

వైసీపీ హ‌యాంలో కొన్ని డిస్టిలరీల‌కు ఇండెంట్లు పెంచేసి, మరి కొన్నింటికి తగ్గించినట్టు పేర్కొన్నారు. దీనివెనుక ఎంపీ మిథున్ హ‌స్తం ఉంద‌న్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే మిథున్ రెడ్డి హైకోర్టులో సోమ‌వారం సాయంత్రం అత్య‌వ‌స‌ర పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ వ్యవహారంతో తనకు ఏటువంటి సంబధం లేదని పేర్కొన్న మిథున్ రెడ్డి… త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోర్టును కోరారు. అయితే.. అప్ప‌టికే కోర్టు స‌మ‌యం మించి పోవడంతో కేసు విచార‌ణ ఎప్పుడు వ‌చ్చేదీ సందిగ్ధంలో ప‌డింది.