సాధారణంగా శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా పార్టీకి చెందిన సభ్యులు హద్దుమీరి ప్రవర్తిస్తే మార్షల్స్ రంగ ప్రవేశం చేస్తారు. సభలో గందరగోళం సృష్టించి సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న సభ్యులను సభ నుంచి బయటకు పంపిస్తారు. ఇంకా మాట వినని సభ్యులెవరైనా ఉంటే వారిని మార్షల్స్ బలవంతంగా ఎత్తుకు తీసుకువెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, మంత్రి నారా లోకేశ్ మాత్రం మార్షల్స్ ను మరోలా ఉపయోగించుకోవచ్చంటూ శాసన మండలి ఛైర్మన్ మోషెస్ రాజుకు సరికొత్త ఐడియా ఇచ్చారు. సభ నుంచి పారిపోతున్న వైసీపీ సభ్యులను సభ లోపలికి తెచ్చేందుకు మార్షల్స్ సాయం తీసుకోవాలని లోకేశ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
2019-24 వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చను నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ అంశంపై చర్చకు అనుమతిస్తూ మండలి ఛైర్మన్ ఆదేశాలు జారీ చేశారని, బీఏసీలో వైసీపీ సభ్యులు అంగీకరించారని లోకేశ్ గుర్తు చేశారు. ఆ అంశంపై సమాధానం ఇస్తుండగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారని లోకేశ్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోతారని, సమాధానానికి సమయం ఇవ్వరని, సమాధానం ఇచ్చే సమయంలో సభలో ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశఆరు.
పదేపదే ఈ విధంగా చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. గతంలో మార్షల్స్‌ను పెట్టి సభను నడిపించిన పరిస్థితి ఉందని, ఇప్పుడు మార్షల్స్‌ను పెట్టి బయట ఉన్న వైసీపీ సభ్యులను సభకు తీసుకు వచ్చే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఆ అధికారం ఛైర్మన్‌కు ఉందని గుర్తు చేశారు. మార్షల్స్ ను పెట్టి బయటకు వెళ్లిన వైసీపీ సభ్యులను లోపలికి తీసుకురావాలని ఛైర్మన్‌ను లోకేశ్ కోరిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.