తెలంగాణ లో పొట్టి శ్రీరాములు పేరు తీసేశారు

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం తాజాగా షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తిష్టాత్మ‌క‌ తెలుగు విశ్వ‌వి ద్యాల‌యం పేరును మార్పు చేస్తూ.. కీల‌క బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్ర‌స్తుతం ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం పేరును సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి పేరుతో మార్చ‌నుంది. దీనికి సంబంధించిన బిల్లును మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ ప్ర‌వేశ పెట్టగా.. స‌భ ఆమోదం తెలిపింది. ఈ సంద‌ర్భంగా బీజేపీ-కాంగ్రెస్ స‌భ్యుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఏంటీ ప్ర‌త్యేక‌త‌..?

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దేశంలో భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన తొట్ట తొలి విశ్వ విద్యాలయం. ఇది 1985 డిసెంబరు 2న ప్రత్యేక శాసనసభ చట్టం ద్వారా హైదరాబాదులో స్థాపించారు. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనమైంది. రాజమండ్రి లో విశ్వవిద్యాలయం శాఖ ఉంది. అయితే.. గ‌తంలోనే కేసీఆర్‌.. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అనేక పేర్లు మార్చిన‌ప్పుడు.. ఈ విశ్వ‌విద్యాల‌యం పేరును కూడా మార్చాల‌ని నిర్ణ‌యించారు.

కానీ, భాషా పండితులు, క‌వులు, జ‌ర్న‌లిస్టుల విజ్ఞ‌ప్తితో కేసీఆర్ అప్ప‌ట్లో వెన‌క్కి త‌ప్పారు. తాజాగా రేవంత్ రెడ్డి మాత్రం.. ఉరుములు లేని పిడుగు మాదిరిగా.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని స‌భ‌లోకి బిల్లు ప్ర‌వేశ పెట్టే వ‌ర‌కు గోప్యంగా ఉంచారు. ఉమ్మ‌డి ఆంధ్ర రాష్ట్ర సాధ‌న కోసం.. పొట్టి శ్రీరాములు త‌న జీవితాన్ని త్యాగం చేసిన మార్చి 16వ తేదీకి మ‌రునాడే.. ఆయ‌న పేరును తీసేయ‌డం వివాదానికి తీసింది. ఈ క్ర‌మంలో స‌భ‌లో బీజేపీ స‌భ్యులు కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

నాయ‌కుల త్యాగాల‌ను గుర్తు చేసుకునే సంస్కృతి కాంగ్రెస్‌కు లేద‌న్నారు. అయితే.. కాంగ్రెస్ నాయ‌కులు కూడా ధీటుగా ఎదురుదాడి చేశారు. పొట్టి శ్రీరాములు త‌మ‌వాడేన‌ని.. త‌మ పార్టీ త‌ర‌ఫునే పోరాటం చేశార‌ని చెప్పుకొచ్చారు. అందుకే ఆయ‌న పేరును చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్ట‌నున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా ప్ర‌క‌టించారు.