సోషల్ మీడియాలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచుకునేందుకు వినూత్న రీతిలో వ్యాపార ప్రకటనలను జారీ చేయడంతో పాటుగా వాటిని జనాల్లోకి పంపేందుకు విభిన్న మార్గాలను ఎంచుకుంటూ ఉంటాయి. వీటిలో విభిన్నంగా ఉండే వ్యాపార ప్రకటనల పట్ల జనం ఇట్టే ఆకర్షితులు అవుతారు. అయితే శనివారం నాటి సోషల్ మీడియా హోర్డింగ్ వ్యాపార ప్రకటన కాదు. రాజకీయాలకు సంబంధించిన ప్రకటన. తెలంగాణలో అధికార కాంగ్రెస్ రూపొందించిన ఈ హోర్డింగ్ హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది.
ఈ హోర్డింగ్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల్లో రాష్ట్రం ఎలా ఉందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా అధికార పార్టీ నేతలు ప్రకటనను రూపొందించారు. ఈ హోర్డింగ్ లో సగ భాగాన్ని బీఆర్ఎస్ కు కేటాయించిన హస్తం పార్టీ.. మిగిలిన సగ భాగాన్ని రేవంత్ పాలనను చూపెట్టింది. బీఆర్ఎస్ పాలనకు సంబంధించిన సగభాగంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవితల ఫొటోలను పొందుపరచిన కాంగ్రెస్ నేతలు… ”కేసీఆర్ ఫ్యామిలీ లూటెడ్ తెలంగాణ” అంటూ ఓ క్యాప్షన్ ను దానికి యాడ్ చేశారు. దాని కింద తెలంగాణలో జరుగుతున్న దారుణాలతో పాటుగా రాష్ట్రం ఎడారిగా మారిపోయిన వైనాన్ని చూపించారు.
ఇక రేవంత్ పాలనకు సంబంధించిన సగ భాగంలో సీఎం చిరునవ్వులు చిందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను పెట్టిన కాంగ్రెస్ పార్టీ… ”రేవంత్ రెడ్డి ఈజ్ రీబిల్డింగ్ తెలంగాణ” అంటూ ఓ క్యాప్షన్ ను పొందుపరిచారు. అంతేకాకుండా రేవంత్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్లుగా… తెలంగాణ పటాన్ని పచ్చదనంతో నింపి చూపించారు. అంతేకాకుండా ”తెలంగాణ రైజింగ్” అన్న క్యాప్షన్ ను కూడా దాని కిందగా పొందుపరిచారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో, బయటా జోరుగా చర్చ జరుగుతున్న వేళ… ఓ భారీ వాహనంపై ఈ హోర్డింగ్ ను పెట్టేసి.. తెలంగాణ కాంగ్రెస్ శాఖ హైదరాబాద్ లో తిప్పుతుండటం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.