దాశరథి, గద్దర్, శ్రీపతి రాములు.. ఎందరెందరో..?

జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను ప్రభావితం చేసిన ఎందరెందరో ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ… వారితో తన అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ సాగారు. ఏపీ కేంద్రంగానే రాజకీయం చేస్తున్న తాను… తనలోని తెలంగాణ మూలాలను ఎన్నటికీ మరువలేనని ఆయన అన్నారు. ఈ క్రమంలో ప్రముఖ కవి దాశరథి రంగాచార్యను గుర్తు చేసుకున్న పవన్.. తెలంగాణకు చెందిన ఓ కవి రచనలను చదివే తాను పెరిగానని, రాజకీయంగా ప్రభావితం అయ్యానని తెలిపారు. తనపై దాశరథి రచనల ప్రభావం ఎంతగానో ఉందని ఆయన చెప్పారు.

ఇక ఆ తర్వాత ప్రజా కవి గద్దర్ ను గుర్తు చేసుకున్న పవన్… తనలోని రాజకీయ స్పృహను అందరికంటే ముందుగా గుర్తించింది గద్దరేనని గుర్తు చేసుకున్నారు. తాను నటించిన ఖుషీ సినిమాలోని ఓ పాటను చూసిన గద్దర్… తన సోదరుడు చిరంజీవి వద్దకు వచ్చి మరీ తనను కలవాలని కోరినట్లుగా గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తనను కలిసిన గద్దర్… ఆ సినిమా, అందులో ఆయనను కట్టిపడేసిన పాట… అందులో తాను చూపించిన దేశ భక్తి, దేశంపై తనకున్న వల్లమాలిన అభిమానం గురించి గద్దర్ ఆసక్తికరంగా వివరించారన్నారు. నాటి నుంచే గద్దర్ తో తన పరిచయం ఏర్పడి అలా ఏళ్ల తరబడి కొనసాగిందన్నారు. చివరకు గద్దర్ తనకు సోదరుడిగా మారిపోయారని కూడా పవన్ చెప్పారు.

ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీపతి రాములు గురించి పవన్ ప్రస్తావించారు. అంతేకాకుండా సభకు హాజరైన రాములును ఆయన వేదిక మీదకు పిలిపించి మరీ ఘనంగా సత్కరించారు. తనలోని రాజకీయ పరిణతిని తన సినిమాల్లోనే గుర్తించిన రాములు… నాడు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్నా… తనతో బేటీ కోసం ఆయన హైదరాబాద్ వచ్చారని… తనతో బేటీకి చాలా యత్నించారని…చివరకు తనతో సమావేశమై తనలోని సామాజిక స్పృహను తెలియజెప్పారన్నారు.

అంతేకాకుండా రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించగా… తనకు ఇంకా అంత పరిణతి రాలేదని, వచ్చినప్పుడు చూద్దామని చెప్పానన్నారు. ఆ తర్వాత వీలున్నప్పుడల్లా తనను కలిసిన రాములు… రాజకీయ ప్రవేశంపైనే మాట్లాడేవారన్నారు. ఇక తన రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైన సమయంలో రాములుకు ఆ విషయాన్ని చెప్పానని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాములు తనతో టచ్ లోనే ఉంటున్నారని తెలిపారు. అయితే ఏనాడూ తన నుంచి రాములు ఏమీ ఆశించలేదన్న పవన్… తాను ఓడినప్పుడు కూడా తనలో ఆత్మ స్థైర్యాన్ని నూరిపోశారన్నారు. నిత్యం తనకు మార్గదర్శిగా నిలిచిన రాములుకు అసలు జనసేనతోనే సంబంధం లేదని కూడా పవన్ చెప్పుకొచ్చారు.