భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అసెంబ్లీ గేట్లను కూడా తాకనివ్వబోమన్న పార్టీల నేతల తొడలను బద్దలు కొట్టామని ఆయన వ్యాఖ్యానించారు. గుండె ధైర్యమే బలంగా సాగడంతోనే ఈ తరహా విజయాలు సాద్యమయ్యాయని కూడా ఆయన అన్నారు.

జనసేన 12వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురం శివారు ప్రాంతం చిత్రాడలో శుక్రవారం విజయకేతనం పేరిట బారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు హాజరైన పవన్ కల్యాన్ పార్టీ అధినేత హోదాలో కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని సోదాహరణంగా వివరించారు.

2014లో తెలంగాణ గడ్డపై జనసేనను ప్రారంభించానని చెప్పిన పవన్…ఆంధ్రాను కార్యస్థానంగా చేసుకుని రాజకీయం చేశానని తెలిపారు. రాజకీయాల్లో తాను ఎన్నో అవమానాలను, పరాభవాలను చవిచూశానని తెలిపారు. అయినా ఏనాడూ వెనకడుగు వేయలేదని చెప్పారు. అసలు భయమన్నది లేని తత్వమే తనను ఇంత దాకా నడిపించిందన్నారు. గుండె ధర్యాన్నే ఓ కవచంలా ధరించిన కారణంగానే తాను ఇంత దూరం రాగలిగానన్నారు.

2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసినా…భయం లేని కారణంగానే రాజకీయాల్లో కొనసాగానన్నారు. ఈ క్రమంలో నాటి అధికార పార్టీ తనను నానా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. తనపై లెక్కలేనన్ని కుట్రలు చేసిందని, కుతంత్రాలకు పాల్పడిందని ఆరోపించారు. అయినా కూడా భయం లేని కారణంగానే తాను రాజకీయాల్లో నిలబడగలిగానని కూడా పవన్ చెప్పుకొచ్చారు.

భయం లేని కారణంగానే 2024 ఎన్నికల్లో ధైర్యంగా పోటీకి దిగామని పవన్ అన్నారు. ఆ భయం లేని తత్వమే పార్టీకి 100 శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించామని ఆయన గుర్తు చేశారు. ఈ 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశానని ఆయన అన్నారు. ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలిగాం కాబట్టే…యావత్తు దేశం దృష్టిని ఆకట్టుకునే విజయం సొంతం అయ్యిందని ఆయన అన్నారు.

అసెంబ్లీ గేట్లను తాకనివ్వబోమంటూ తొడలు కొట్టిన వారి తొడలను బద్ధలు కొట్టి ఏకంగా అధికార కూటమిలో భాగస్వాములమయ్యామన్నారు. తాము గెలవడంతో పాటుగా 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టామని పవన్ అన్నారు. 11 ఏళ్ల ప్రస్థానంతో వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశామని కూడా ఆయన అన్నారు. ఎన్డీఏ కూటమి విజయంలో కీలక భూమిక పోషించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, వీర మహిళలు చేసిన త్యాగాలను ఆయన ఆకాశానికి ఎత్తారు.

తాను ఏపీ రాజకీయాలకే పరిమితం అన్నట్లుగా ప్రసంగించిన పవన్ కల్యాణ్…తనకు మద్దతుగా నిలుస్తున్న తెలంగాణ పార్టీ శ్రేణులు, నేతల త్యాగాలనూ గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో తనను రాజకీయంగా అభిమానించే వారు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్నారని చెప్పిన పవన్… ఆయా రాష్ట్రాల్లోని తన అభిమానులకు వారి భాషల్లోనే అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయా భాషల్లో వరుసగా ప్రసంగించిన పవన్… దేశంలో బహు భాషా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతనా ఉందని ఓ కన్ క్లూజన్ ఇచ్చారు. ఈ క్రమంలో భారత మాతాకీ జై అన్న పవన్ నినాదానికి జనసైనికుల నుంచి భారీ స్పందన లభించింది. ఆయా రాష్ట్రాల్లో తన రాజకీయ ప్రసంగాలను ఆసక్తిగా వింటారని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారనన్నారు. బీజేపీ కీలకనేత, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కోరిక మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశానని…తాను ప్రచారం చేసిన ప్రాంతాల్లో 95 శాతం మేర ఎన్డీఏకు విజయం దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు.