జనసేన ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ శ్రేణుల్లో ఏ మేర జోష్ ను నింపాయన్నది.. పిఠాపురం శివారు చిత్రాడలో జయకేతనం పేరిట జరుగుతున్న సభకు వచ్చిన జన సైనికులను చూస్తేనే తెలిసిపోతోంది. పార్టీ పెట్టి 11 ఏళ్లు పూర్తి కావడం, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 100 స్ట్రైక్ రేటుతో పార్టీ ఘన విజయం సాధించడం… పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. చట్టసభల్లో అడుగు పెట్టిన తొలిసారే ఏకంగా డిప్యూటీ సీఎం కావడం.. ఈ పరిణామాల నేపథ్యంలోనే పార్టీ ఆవిర్భావ వేడుకలు అంటే… ఏ పార్టీలో అయినా ఫుల్ జోష్ కనిపిస్తుంది కదా. అదే జోష్ ఇప్పుడు జన సైనికుల్లో కొటక్టొచ్చినట్టు కనిపిస్తోంది.
అయితే పవన్ కల్యాణ్ కు చెందిన ఓ వీడియోను చూస్తే మాత్రం ఈ జోష్ జన సైనికుల రక్తంలోనే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పవన్ కల్యాణ్ లోనూ జన సైనికులను మించిన జోష్ ఉందని కూడా చెప్పక తప్పదు. శుక్రవారం నాటి జయకేతనం సభకు వస్తున్న క్రమంలో హెలికాఫ్టర్ ను పవన్ వినియోగించిన సంగతి తెలిసిందే. చిత్రాడలోని జయకేతనం సభకు హాజరయ్యేందుకు హెలికాఫ్టర్ ఎక్కేందుకు వచ్చిన పవన్… హెలికాఫ్టర్ ను సమీపించే క్రమంలో పరుగు అందుకున్నారు. అప్పటిదాకా ఆయన వెంట వస్తున్న సెక్యూరిటీ సిబ్బంది కూడా పవన్ పరుగు పెట్టగానే… ఆయన వెంట పరుగు పెట్టారు. అయినా కూడా వారు పవన్ ను అందుకోలేకపోయారు. పవన్ పరుగు ఆయనలోని జోష్ ను ఇట్టే చెప్పేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడంటే… జనసేన అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది గానీ..గడచిన 11 ఏళ్లుగా ఆ పార్టీ చవిచూడని అవమానం లేదనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీకి దిగితే… రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ సోదరుడు నాగబాబు నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడారు. జనసేన తరఫున బరిలో నిలిచిన వారిలో ఒక్కరు తప్పించి అందరూ ఓడారు. అయినా గానీ… పవన్ ఎప్పుడు బయటకు వచ్చినా…ఆయన వెంట జన సైనికులు వేలు, లక్షలుగా కదిలిన వైనం తెలిసిందే. అంటే… విజయాలు, అపజయాలు అన్న దానితో సంబంధం లేకుండానే జన సైన్యం పవన్ ను అనుసరించింది. ఇందుకు కారణంగా పవన్ లో టన్నుల కొద్దీ ఉన్న జోషేనని చెప్పాలి. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ జోష్ మరింతగా ఎక్కువగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates