ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హోలీ వేళ… కీలక సూచనలు చేశారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో బంధాలు వద్దని ఆయన టీడీపీ శ్రేణులకు సూచించారు. వైసీపీతో బంధాన్ని ఉపేక్షించమని, కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన దాదాపుగా హెచ్చరికలు జారీ చేశారు. ఏదో చిన్నస్థాయి కదా అనుకుంటే… వైసీపీ నేతలో బంధాలు నెరపిన వారికి కఠిన దండన తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
ఇక సంక్షేమ పథకాల అమలులో వివక్షకు అసలు ఎంతమాత్రం కూడా చోటు ఇవ్వవద్దని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు సూచించారు. ఏ పథకం అయినా.. అర్హతే ప్రామాణికంగా సాగాలని కూడా ఆయన సూచించారు. ఈ విషయంలో పార్టీ, కులం, ప్రాంతం అన్న తేడాలను చూడొద్దన్నారు. పథకాల అమలులో ఫలానా పార్టీ వారైతే పథకాలు రావు అన్న భావనే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. సంక్షేమ పథకాలకు,…రాజకీయ సంబంధాలకు చాలా తేడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విభజన రేఖను టీడీపీ నేతలు జాగ్రత్తగా గమనించుకుంటూ సాగాలని సూచించారు.
ఇక కూటమిలోని మిత్రపక్షాలకు చెందిన నేతలతో సఖ్యతగా మెలగాలని కూడా చంద్రబాబు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అన్ని కార్యక్రమాల్లో మిత్రపక్షాల నేతలను కలుపుకుని వెళ్లాలని… మిత్రపక్షాల నేతలతో పొరపొచ్చాలు, అరమరికలు లేకుండా సాగితేనే కూటమికి బలం అన్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు. మూడు పార్టీలకు చెందిన నేతల మధ్య ఐక్యత ఉంటే… కూటమిని ఓడించే శక్తి మరెవరికీ లేదని కూడా ఆయన అన్నారు. జనసేన, బీజేపీ నేతలతో కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు వచ్చినా.. కూటమి ఐక్యతను గుర్తుంచుకుని టీడీపీ శ్రేణులు ముందుకు సాగాల్సి ఉందని ఆయన సూచించారు.
ఇక పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని చంద్రబాబు అన్నారు. పార్టీలో ఇప్పుడు పదవులు రాకుంటే…మరో రెండేళ్లకైనా అవకాశం దక్కుతుంది… అప్పటికీ దక్కకున్నా…ఆ తర్వాతైనా దక్కుతుంది అన్న భావనతో సాగాలని ఆయన సూచించారు. పార్టీ కోసం నియోజకవర్గాల వారీగా నిస్వార్థంగా సేవలు చేసిన వారి జాబితాలను ఇంకా చాలా మంది నేతలు పంపలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డవారి కోసం ప్రస్తుతం 21 ఆలయాల ట్రస్టు బోర్టు చైర్మన్ పదవులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని.. పార్టీ కోసం కష్టపడ్డ వారికే ఆ పదవులు దక్కుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.