టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు తాను పాల వ్యాపారం చేసే వాడినని లోకేశ్ అన్నారు. ఈ క్రమంలో గోశాల ప్రాధాన్యం, ఆవు పాల ప్రాముఖ్యత గురించి తనకు బాగా తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాల్లోకి రాక ముందు తాను ఏం చేశానన్న విషయాన్ని చెబుతూ లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగానే ఆసక్తి రేపుతున్నాయి.
హోలీ పర్వదినాన శుక్రవారం… తన సొంత నియోజకవర్గం మంగళగిరి పరిధిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సతీసమేతంగా వెళ్లిన లోకేశ్.. అక్కడ పూజాదికాల్లో పాలుపంచుకున్నారు. అనంతరం ఆలయ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలను ఆయన సందర్శించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రసంగించిన సందర్భంగా లోకేశ్ తాను సాగించిన పాల వ్యాపారం గురించి ప్రస్తావించారు. పాల వ్యాపారం చేసిన వాడిని కాబట్టే.. గోశాల ప్రాధాన్యం ఏ పాటిది అన్న విషయం తనకు తెలుసునని లోకేశ్ అన్నారు.
అదేంటీ లోకేశ్ పాల వ్యాపారం చేశారా? అని ఆశ్చర్యపోవాాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. అదేదో తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాదిరిగా లోకేశేమీ పాల క్యాన్లను స్కూటర్ కు కట్టుకుని పాల వ్యాపారం చేయలేదు. హెరిటేజ్ పేరిట తన తండ్రి స్థాపించిన డెయిరీ వ్యవహారాలను లోకేశ్ పర్యవేక్షించారు. ఇప్పటికీ చంద్రబాబు కుటుంబం ఆధ్వర్యంలోనే హెరిటేజ్ డెయిరీ నడుస్తున్న విషయం తెలిసిందే. రాజకీయాల కారణంగా అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ లు హెరిటేజ్ కు దూరంగా ఉంటున్నా… లోకేశ్ తల్లి భువనేశ్వరి, ఆయన సతీమణి నారా బ్రాహ్మణిలు ఈ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ… విజయవంతంగా కంపెనీని నడుపుతున్నారు.