తెలంగాణ అసెంబ్లీలో గురువారం చోటుచేసుకున్న రచ్చ… బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. జగదీశ్ రెడ్డి పొరపాటు చేయకున్నా కూడా ఆయనపై బహిష్కరణ వేటు వేశారంటూ బీఆర్ఎస్ గురువారమే నిరసనకు దిగంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ సర్కారు నిరంకుశ నిర్ణయాలపై నిరసన తెలపాలని ఆ పార్టీ అధిష్ఠానం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఫలితంగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతాయని అంతా భావించారు. అయితే ఈ నిరసనలపై హోలీ వేడుకల ప్రభావం పడిపోయింది.
అయితే అనూహ్యంగా శుక్రవారం తెలంగాణలోని ఏ ఒక్క ప్రాంతంలోనూ పెద్దగా నిరసనలకే జరగలేదు. అక్కడక్కడ ఒకటి, రెండు చోట్ల నిరసనలు జరిగినా…వాటిలో వేళ్లపై లెక్కపెట్టేంత మంది పార్టీ శ్రేణులు మాత్రమే పాలుపంచుకున్నారు. ఈ నిరసనలు చూసినంతనే… ఇవెక్కడి నిరసనలు అంటూ జనం ముక్కున వేలేసుకున్నారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ గతంలో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్న జనం… ఇప్పుడున్నది బీఆర్ఎస్ పార్టీనేనా అని తమను తాము ప్రశ్నించుకున్నారు.
జనం ముక్కున వేలేసుకున్న మాదిరిగా తేలిపోయిన బీఆర్ఎస్ నిరసనల పిలుపునకు కారణం హోలీ వేడుకలేనని చెప్పాలి. శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలోనూ ఈ వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. దాదాపుగా అందరూ హోలీ వేడుకల్లోనే మునిగిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా హోలీ వేడుకల్లో మునిగిపోయారు. హిందువులు అత్యంత ఘనంగా నిర్వహించుకునే వేడుక హోలీ కాబట్టి… అదే రోజున బీఆర్ఎస్ ఇచ్చిన నిరసనల పిలుపునకు అంతగా స్పందన రాలేదు.