ఆర్జీవీని ఎంత అడిగినా..

ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసి దేశంలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా వెలుగొందాడు రామ్ గోపాల్ వర్మ. కానీ ఆ తర్వాత ఆయన్నుంచి ఎంత నాసిరకం సినిమాలు వచ్చాయో తెలిసిందే. అది చాలదన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయోజనం పొందుతూ ఆ పార్టీ ప్రత్యర్థుల మీద చీప్ సినిమాలు తీయడం.. దారుణమైన కామెంట్లు చేయడం.. ఇలాంటి పనులెన్నో చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు వర్మ. కంటెంట్ అయిపోయి సరైన సినిమాలు తీయలేకపోవడం వేరు. కానీ ఒక పార్టీ కోసం ప్రత్యర్థుల మీద ప్రాపగండా మూవీస్ చేయడం వేరు.

ఇక శ్రీరెడ్డి వాళ్లను ఆయుధంగా మార్చుకుని ప్రత్యర్థులను బూతులు తిట్టించడం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలాంటి పనులతో వ్యక్తిగా ఆర్జీవీ ఎంత పతనం అయిపోయాడో అందరికీ తెలిసిందే. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఆయన మీద ఏపీలో కేసులు నమోదు కావడం.. అందులో భాగంగా పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాల్సి రావడం తెలిసిందే. ఇదిలా ఉండగా వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాల ప్రస్తావన వస్తే ఒక్క మాట కూడా మాట్లాడ్డానికి కూడా వర్మ ఇష్టపడలేదు.

పోసాని మీద నమోదైన కేసులు, ఆయన అరెస్ట్ గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా.. ‘‘నాకు దాని గురించి తెలియదు. కేసు డీటైల్స్ ఫాలో అవ్వలేదు. నేను నా సినిమాలతో బిజీగా ఉన్నా. కేసులకు సంబంధించి కోర్టు వ్యవహారం కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. ఇక ఎవరికి ఏమవుతోందన్నది కూడా నేను ఫాలో అవ్వట్లేదు. నాకు దాంతో సంబంధం లేదు. ఈ ఆన్సర్ స్కిప్ చేయండి’’ అని వర్మ అన్నాడు.

పోసాని సైతం రాజకీయాలకు దూరం, తాను ఇక వాటి గురించి మాట్లాడను అన్నప్పటికీ అరెస్ట్ చేయడం గురించి ప్రస్తావించగా.. ‘‘నేను రాజకీయాల గురించి మాట్లాడను. నాకు పాలిటిక్స్ గురించి ఏమీ తెలియదు. నేను ఏమీ ఫాలో కావట్లేదు’’ అని వర్మ తేల్చేశాడు. ‘పొలిటికల్ క్వశ్చన్స్ అడిగితే తాను ఇంటర్వ్యూ ఆపేసి వెళ్లిపోతానన్నాడు ఆర్జీవీ. మీరు గతంలో తీసిన పొలిటికల్ మూవీస్ గురించి ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగింది అని అడిగితే.. అది నిర్మాతల్ని అడగాలని, తానొక క్రియేటివ్ పర్సన్ అని చెప్పాడు. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందని అడిగితే.. తాను ఫాలో కావట్లేదని తేల్చేశాడు.