సంబరాల వేళ చెవిరెడ్డికి షాక్

Chevireddy Bhaskar Reddy
Chevireddy Bhaskar Reddy

వైసీపీకి చెందిన కీలక నేతలకు వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, చోటామోటా నేతలు కూడా విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై ఎక్కడికక్కడ కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాలపై ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటుగా వారిలో కొందరిని అరెస్టు కూడా చేసింది. మరికొందరు కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిళ్లు తీసుకుని అరెస్టు నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నారు. ఇలాంటి వైసీపీ నేతల జాబితాలో ఇప్పుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇంచార్జీ చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంతు వచ్చింది.

బుధవారం వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకునే నిమిత్తం ఒంగోలులోని వైసీపీ కార్యాలయానికి చెవిరెడ్డి చేరుకోగా… సమాచారం అందుకున్న ఎర్రగొండపాలెం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎర్రగొండపాలెం వెళ్లిన సందర్భంగా అక్కడ వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా..అందులో చెవిరెడ్డి పాత్ర ఉందంటూ ఆయనపై పోలీసులు ఏకంగా 5 కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకున్న సందర్భంగానే చెవిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడం గమనార్హం.

వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకున్న తర్వాత తన వద్దకు వచ్చిన పోలీసులు ఇచ్చిన నోటీసులను చెవిరెడ్డి అందుకున్నారు. సంబంధిత పత్రాలపై అక్కడే సంతకం చేసిన చెవిరెడ్డి నోటీసులు తీసుకున్నారు. అదే సమయంలో ఈ కేసు విచారణకు ఎప్పుడో కాదు… ఈ రోజే హాజరు కావాలని పోలీసులు చెవిరెడ్డికి తెలిపారు. దీనికి సరేనంటూ చెవిరెడ్డి కూడా తలూపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి… పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. తనపై ఎన్నైనా కేసులు పెట్టుకోండి… తానేమీ భయపడేది లేదని ఆయన తెలిపారు. గతంలో జగన్ పక్షాన నిలబడినందుకు తనపై ఏకంగా 88 కేసులు నమోదు చేశారని ఆయన అన్నారు. కేసులతో వైసీపీని, తనను అడ్డుకోలేరని కూడా చెవిరెడ్డి తెలిపారు. కేసులకు, పోలీసుల విచారణకు తాను భయపడేది లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు.