అంతా అనుకున్నట్టే అయ్యింది. వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పరారయ్యారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న అనిల్…హైకోర్టు ఇచ్చిన సదరు బెయిల్ నిబంధనల ప్రకారం మంగళవారం (ఈ నెల11) సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో లొంగిపోవాల్సి ఉంది. గత నెలలో మంజూరు అయిన మధ్యంతర బెయిల్ ను అనిల్ వినతి మేరకు హైకోర్టు ఈ నెల 11 దాకా పొడిగించింది. దీంతో ఈ నెల 1న సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన అనిల్… తన మొబైల్ ఫోన్ ను స్విచాఫ్ చేసుకున్నారు. ఈ క్రమంలో అనిల్ పరారీలో ఉన్నాడని, హైకోర్టును నమ్మించి అతడు దర్జాగా రాజమార్గం ద్వారానే పారిపోయాడని ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ లను అర గంటలో చంపేస్తానంటూ వైసీపీ అధికారంలో ఉండగా సంచలన వ్యాఖ్యలు చేసిన అనిల్.. తనను తాను వైసీపీ అధినేత, నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకున్నారు. చంద్రబాబు, లోకేశ్ లతో పాటు జనసేన అదినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపైనా అనిల్ అసభ్యకర పదజాలంతో విరుచుకుపడ్డారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఏకంగా బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారాలపై నాడే పోలీసులకు ఫిర్యాదులు అందినా కేసులు నమోదు కాలేదు. అధికార పార్టీ అండ చూసుకుని పలువురు వ్యక్తులను బెదిరించిన అనిల్. డబ్బులు కూడా వసూలు చేశారు.
బలవంతపు వసూళ్లకు పాల్పడ్డ కేసులో కూటమి పాలన మొదలయ్యాక అనిల్ అరెస్టు కాగా… రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు ఆయనను పోలీసులు తరలించారు. పోలీసుల అదుపులో ఉండి కూడా అనిల్ కు రాచమర్యాదలు అవందుతున్నాయన్న వార్తలు పెను కలకలమే రేపాయి. అంతేకాకుండా సెంట్రల్ జైలులోనే ఆయన వైసీపీ కీలక నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించినట్లుగానూ ఆరోపణలు ఉన్నాయి. తల్లి అనారోగ్యం పేరిగ మధ్యంతర బెయిల్ తీసుకున్న అనిల్… తల్లి వెంట వెళ్లలేదని తాజాగా తేలింది. బెయిల్ పై బయటకు వచ్చినప్పటి నుంచి ఫోన్ ను స్విచాఫ్ చేసుకున్న అనిల్… వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లిపోయారని… బెయిల్ గడువు ముగిసినా అతడు లొంగిపోయే అవకాశాలు లేవన్న వార్తలు రెండు, మూడు రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ అతడు మంగళవారం సెంట్రల్ జైలుకు రాలేదు. ఇదే విషయాన్ని జైలు అధికారులు ఇటు హైకోర్టుతో పాటు అటు పోలీసులకు కూడా సమాచారం అందించారు.