లోకేష్ ఐడియా.. ఇక కార్పొరేట్ హంగులు!

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల తీరును మార్చేయాల‌ని నిర్ణ‌యించుకున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు ఐడియాలతో పాఠ‌శాల విద్య‌పై క‌స‌రత్తు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యార్థుల త‌ర‌హాలో ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో విద్య‌ను అభ్య‌సించేవారు కూడా ఉండాల‌ని భావించారు. మెడ‌లో టై, పాదాల‌కు పాలిష్డ్ బూట్లు, చూడ‌గానే ఆక‌ర్షించేలా ఉండే.. డ్ర‌స్ కోడ్‌.. వంటివి ఇప్పుడు అమ‌లు చేయ‌నున్నారు. దీనికి సంబంధించి పాఠ‌శాల విద్యార్థుల‌కు ఇచ్చే యూనిఫామ్‌ను మంత్రి సెల‌క్ట్ చేశారు.

వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం(జూన్ 12) నుంచి స్కూల్ యూనిఫామ్లు మారనున్నాయి. కొత్త యూనిఫా మ్‌ల‌కు తాజాగా మంత్రి లోకేష్‌ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ఈ యూనిఫాం రూపొందించారు. అదేవిధంగా ఏదో ఇచ్చామంటే ఇచ్చామ‌ని అన్న‌ట్టుగా కాకుండా.. మొక్కుబ‌డి తంతుకు ఫుల్ స్టాప్ పెట్టి.. మ‌న‌స్పూర్తిగా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే ఆక‌ర్షించే క‌ల‌ర్స్ ఉన్న వ‌స్త్రాల‌ను ఎంపిక చేశారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో భాగంగా స్టూడెంట్లకు యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ ప్రభుత్వం అందించ నుంది. అంద‌రికీ ఒకే రోజు ఇచ్చేలా కూడా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. కాగా.. ఈ ప‌థ‌కాన్ని గ‌తంలో వైసీపీ ప్రారంభించింది. కార్పొరేట్ స్కూళ్ల‌కు పోటీ ప‌డేలా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కూడా తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యిం చింది. అనుకున్న ల‌క్ష్య సాధ‌న‌లో కొంత మేర‌కు దూకుడు చూపించినా.. జ‌గ‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ లోపించ‌డం.. మ‌ధ్యలో కొంద‌రు నాయ‌కుల జోక్యంతో ఈ కార్య‌క్ర‌మం వైసీపీకి పెద్ద‌గా పేరు తీసుకురాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.