జగన్ వి చిన్నపిల్లాడి చేష్టలు

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. జగన్ ను ఓ విధ్వంసకారుడిగా అభివర్ణించిన నారాయణ.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ లాంటి వారిని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిన విషయం వాస్తవం కాదా? అంటూ ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీ నేతలంతా ఇప్పుడు బయటే తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక జగన్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోరుతున్న తీరుపై నారాయణ సెటైర్లు సంధించారు. జగన్ తీరు చూస్తుంటే… ఏదో చిన్నపిల్లలు చాకోలెట్ల కోసం కొట్టుకుంటున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రదాన ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ చేస్తున్న యాగీ చూస్తుంటే… ఏవగింపు కలుగుతోందన్నారు. జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని కూడా నారాయణ ప్రశ్నించారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా జగన్ గౌరవించరా? అని నిలదీశారు. జనం తీర్పుతోనే సీఎం అయిన విషయాన్నిజగన్ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

అయినా అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని కూడా నారాయణ ప్రశ్నించారు. తమ సమస్యలపై శాసనసభలో పోరాడతారని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే.. జగనేమో తనకు ఆ పదవి కావాలి.. ఈ పదవి కావాలి అంటూ మారాం చేస్తున్నారని మండిపడ్డారు. ఓ ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ అసెంబ్లీకి వెళ్లి తీరాల్సిందేనని ఆయన అన్నారు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్లకపోతే… జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పునరాలోచన చేయాలన్నారు. అలా కాకుండా అసెంబ్లీకి వెళ్లబోమంటే…జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని జగన్ కు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హలే లేదని ఆయన అన్నారు.