కేసీఆర్ బయటకొచ్చారు!.. అసెంబ్లీలో సమరమే!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు వాడీవేడీగా సాగేలా కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రదాన ప్రతిపక్ష నేతగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) సభకు హాజరే కాలేదు. ఫలితంగా అధికార పక్షం కాంగ్రెస్ ను నిలువరించే సరైన నేత లేరనే చెప్పాలి.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు సభలో ఉన్నా.. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఉంటే ఆ లెక్కే వేరు కదా. అందుకే బుధవారం నుంచి ప్రారంభం కానున్న సమావేశాలకు ఎలాగూ కేసీఆర్ హాజరవుతున్నారు కాబట్టి… సభలో కాంగ్రెస్ కు ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురు కానుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రథాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ను ఎదుర్కోవడం అధికార పక్షానికి ఒకింత కష్టమేనని చెప్పాలి. ఎందుకంటే పదేళ్ల పాటు సీఎంగా, ఉద్యమ నేతగా, అంతకుముందు మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కేసీఆర్ కు సుదీర్ఘ అనుభవం ఉంది. వైరి వర్గాలను ఎలా టాకిల్ చేయాలో కేసీఆర్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. ఆ మజానే వేరుగా ఉంటుందని జనం కూడా భావిస్తున్నారు.

ఇప్పటిదాకా సభలో అధికార పక్షానికే పైచేయిగా సాగింది. అయితే ఇకపై కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అదికార పక్షం చెప్పిందే వేదంగా సాగే పరిస్థితి అంతగా కనిపించదనే చెప్పాలి. ఎందుకంటే… సభా నిర్వహణ తీరుపై సంపూర్ణ అవగాహన కేసీఆర్ సొంతం. అలాంటి నేత ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండగా…అధికార పక్షం ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదు కదా. వెరసి సభలో ఇక సమరమే అన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని ఇటీవలే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా తన నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని ఎరవలి ఫాం హౌస్ లో సేద దీరుతున్న కేసీఆర్.. ఇటీవలే అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఏవో కొన్ని రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన చిన్నచిన్న పనులను పూర్తి చేసుకున్న కేసీఆర్…నంది నగర్ లోని తన నివాసంలోనే ఉంటున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మంగళవారం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగగా… దానికి కేసీఆరే నేతృత్వం వహించారు. ఇందుకోసం తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్ కు ఓ కొత్త కళే వచ్చిందని చెప్పాలి. ఈ లెక్కన బుధవారం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే… సభకు కూడా అదే కొత్త కళ వచ్చి తీరుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.