జగన్ నుంచి ఈ ట్విస్ట్ ఊహించలేదు

మందుబాబులకు ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ఇది ఒక వెరైటీ షాకు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి నిర్ణయం. అదేమిటంటే పొరుగు రాష్ట్రాల నుండి మూడు సీసాలు తెచ్చుకోవచ్చనే నిబంధనను రద్దు చేస్తు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మందుబాబులు ఎప్పుడూ చూడని కొత్త కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. నిజానికి అవన్నీ చాలా చవకబారు మద్యంగా జనాల్లో ప్రచారం ఉంది. అప్పటి వరకు ఉన్న ప్రీమియం బ్రాండ్లలో చాలా వరకు మార్కెట్లో కనబడలేదు. దాంతో మందు బాబుల గోల కూడా ఎక్కువైపోయింది.

విచిత్రమేమిటంటే జనాలకు కావాల్సిన మందును ప్రభుత్వం సప్లై చేయటం లేదంటూ చంద్రబాబునాయుడే ప్రకాశం జిల్లా రోడ్డుషోలో ప్రస్తావించారు. ఇక టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు అయితే మద్యం బ్రాండ్లపై ఎన్నిసార్లు మీడియా సమావేశాలు పెట్టి బాధపడ్డారో చెప్పనే అక్కర్లేదు. సరే ఎవరేమనుకున్నా ప్రభుత్వ ఆలోచనల్లో మాత్రం మార్పురాలేదు. దాంతో పొరుగు రాష్ట్రాల నుండి తమకు కావాల్సిన మద్యాన్ని కొందరు తెచ్చుకుంటున్నారు. పనిలో పనిగా మద్యం వ్యాపారమే వృత్తిగా ఉన్న వాళ్ళు స్మగ్లింగు కూడా మొదలుపెట్టారు.

అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో పొరుగునున్న కర్నాటక, తమిళనాడు, తెలంగాణా, ఒరిస్సా రాష్రాల నుండి స్మగ్లింగ్ బాగా పెరిగిపోయింది. ఒకసారి బయటనుండి మద్యం తెచ్చుకుంటున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. దాంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన న్యాయమూర్తి ఎక్సైజ్ చట్టం ప్రకారం సొంత వాడకానికి మూడు బాటిళ్ళు తెచ్చుకోవచ్చన్న నిబంధన ప్రకారం ఎవరిపైనా కేసు పెట్టేందుకు లేదని తీర్పు చెప్పారు.

అయితే కోర్టు తీర్పును సమీక్షించిన ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసింది. కొత్త పాలసీలో భాగంగా జాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు బాటిళ్ళు తెచ్చుకోవటం కూడా నేరమే. కాబట్టి ఇకనుండి ఎవరి దగ్గర మద్యం బాటిళ్ళు దొరికినా వారిని వెంటనే అరెస్టు చేసే అధికారం పోలీసులకు, ఎక్సైజ్ పోలీసులకు వచ్చింది. మరి ఈ విషయమై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.