తన నియోజకవర్గంలో ప్రజల కష్టాలపై హుటాహుటిన స్పందిస్తున్న మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్.. తాజాగా ఇక్కడి వారికి ఉచిత బస్సు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ బస్సు అందరికీ ఉచితం కావడం గమనార్హం. అయితే.. ఇది లిమిటెడ్ ప్రాంతాల్లోనే పర్యటించి.. ప్రజలకు సేవలు అందించనుంది. ఇలా రెండు ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి లోకేష్ తాజాగా సోమవారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల రాకతో.. నియోజకవర్గం ప్రజలకే కాకుండా.. ఇక్కడున్న ఎయిమ్స్, పలు ముఖ్య ఆలయాలకు వచ్చే భక్తులు, రోగులకు కూడా మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడనుంది.
ఎక్కడ నుంచి ఎక్కడదాకా?
మంగళగిరిలో కేంద్ర వైద్య సంస్థ అయిన ఎయిమ్స్ హాస్పటల్ సహా.. ప్రముఖ దేవాలయం.. పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం వంటివి ఉన్నాయి. అదేవిధంగా ఉండవల్లి గుహలతోపాటు రాజధాని అమరావతి కూడా పర్యాటకంగా ప్రసిద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడకు వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన సీఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూర్చాల్సిందిగా మేఘా ఇంజనీరింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అభ్యర్థించారు.
లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సంస్థ రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఒలెక్ట్రా.. ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ కు నడుస్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడివరకు నడుస్తుంది. ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, పానకాలస్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 నుంచి రాత్రి 8గంటల వరకు ప్రయాణీకులకు ఉచితంగా సేవలందిస్తుంది.
ప్రతి బస్సు 18 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నడుస్తుంది. అదేవిధంగా ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ బస్సులు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ బస్సులను మంగళగిరి ప్రజలకు అంకితం చేస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates