బరిలోకి ఇద్దరు బీఆర్ఎస్ నేతలు… కేసీఆర్ వ్యూహమేంటో?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో మొత్తం 5 స్థానాలు కూటమికే దక్కనున్న నేపథ్యంలో…విపక్షం గోల కనిపించడం లేదు. అయితే తెలంగాణలో మాత్రం ఓ సీటు విపక్ష బీఆర్ఎస్ కు దక్కుతుంది. మిగిలిన 4 సీట్లు అధికార కాంగ్రెస్ ఖాతాలో పడనున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఎన్నికల గురించి ఆదివారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. బరిలోకి పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులను దించాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ఇద్దరు అభ్యర్థులను ఆదివారం రాత్రికి ఖరారు చేయనున్నారు.

వాస్తవానికి 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 34 సీట్లు దక్కాయి. అయితే ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిపోయారు. దీంతో సభలో బీఆర్ఎస్ బలం 24కే పరిమితం అయ్యింది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ కు సభలో ప్రస్తుతం కేవలం 24 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన ఆ పార్టీకి ఒక్క అభ్యర్థి విజయం సాధించే అవకాశాలే ఉన్నాయి. అయితే ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపాలని కేసీఆర్ తీర్మానించినందున… పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెట్టేందుకే ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.

ఒక వేళ బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారకున్నా కూడా ఆ పార్టీ బలం 34 మాత్రమే. ఈ ప్రకారం చూసినా… బీఆర్ఎస్ కు దక్కేది ఒక్క ఎమ్మెల్సీ సీటే. ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపించుకోవాలంటే… ఆ పార్టీకి మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది దుస్సాధ్యమే. అంటే… గెలవలేమని తెలిసినా కూడా కేసీఆర్ తన పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారంటే… పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టేందుకేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీ విప్ ను ధిక్కరించి ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నిలిపే అభ్యర్థులకు ఓటు వేయాలంటే ఒకింత కష్టమే.

ఇదిలా ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటు వేయకపోతే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలవడం కష్టమే. ఒక్కో ఎమ్మెల్సీకి 21 ఓట్లు అవసరం కానుండగా.. ముగ్గురు అభ్యర్థుల విజయానికి 63 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం కానుంది. ఇంకో సీటును మిత్రపక్షం సీపీఐకి ఇవ్వాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. దీంతో తాను పోటీ చేసే మూడు స్థానాలతో పాటు సీపీఐ స్థానాన్నికూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే. ఈ లెక్కన మొత్తం 4 సీట్లకు 84 మంది ఎమ్మెల్యేలు అవసరం కానుంది. బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలను కలుపుకుంటే…కాంగ్రెస్ బలం 79కి చేరుతుంది. మజ్లిస్ మద్దతుతో ఎలాగోలా గట్టెక్కే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటు వేయకపోతే మాత్రం నాలుగు సీట్లను కాంగ్రెస్ గెలవడం కష్టమే. ఈ లెక్కన కేసీఆర్ వ్యూహం అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను, ఇటు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పడేయడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.