రాష్ట్రంలో ప్రభుత్వం ఏది ఉన్నా.. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఏపీ అనేకాదు.. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒకప్పుడు.. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు.. ఉండేవి. కానీ, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. గ్రాంట్ల వ్యవస్థను దాదాపు 20 శాతానికి తగ్గించేసి.. కేవలం ఎంపిక చేసిన వాటికే గ్రాంట్లు ఇచ్చే సంస్కృతిని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో వైసీపీ కూడా ఇదే చెప్పింది.
ఇక, ఇప్పుడు కూటమి సర్కారు కూడా ఇదే బాట పట్టాల్సిన పరిస్థితిలో ఉంది. అయితే.. తాజాగా వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఈ వ్యవహారాన్ని తప్పుబట్టారు. అప్పులు చేస్తున్నారు.. సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని దుయ్యబడుతున్నారు. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణాలను, తల్లికి వందనం పథకాలను అటకెక్కించారని కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో తాము అప్పులు చేసైనా.. కూడా పథకాలను అమలు చేశామని.. నవరత్నాలు ఇచ్చామని చెబుతున్నారు.
అయితే..ఇక్కడ కీలక విషయాన్ని జగన్ తెలుసుకోవాల్సి ఉంది. అప్పులు చేసి.. సంక్షేమం ఇచ్చానని చెబుతున్నా.. అభివృద్ది లేదన్న కారణంగానే ప్రజలు జగన్‌ను దూరం చేశారు. సంక్షేమానికి కూటమి సర్కారు వ్యతిరేకం కాదు. అయితే.. చేస్తున్న అప్పులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా.. ప్రజలు మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించాలన్న ఏకైక దృక్ఫథంతో ముందుకు సాగుతోంది. ఇది మున్ముందు రాబోయే రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తుంది.
ఆతర్వాత.. రాష్ట్రం లో అనూహ్యంగానే సంపద సృష్టి జరిగి.. ఆదాయం పెరుగుతుంది. తద్వారా మరిన్ని పథకాలను అమలు చేసేందుకు కూడా ప్రభుత్వానికి సత్తా ఉంటుంది. ఈ చిన్న తేడాను గుర్తించడంలో జగన్ విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ముందుచూపు లేకపోవడంతోనే సంపద సృష్టికి నాడు బీజాలు వేయలేకపోయారన్న వాదన కూడా వినిపిస్తోంది. కాబట్టి.. ముందుగా సంపద సృష్టికి సర్కారు ఇస్తున్న ప్రాధాన్యం గుర్తించాల్సి ఉంటుంది. లేకపోతే.. నిజంగానే రాష్ట్రం మరో శ్రీలంక అయినా అవుతుందన్న వాదన ఉంది.