బోరుగడ్డ ప్రత్యక్షం… కూటమిపై సంచలన ఆరోపణలు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు. మంత్రి నారా లోకేశ్ లను కేవలం గంట వ్యవధిలోనే చంపేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడికీ వెళ్లలేదట. చెన్నైలోనే ఉన్నారట. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాను అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే అనిల్… కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టైైన సంగతి తెలిసిందే. అయితే తల్లి ఆరోగ్యాన్ని కారణంగా చూపి మధ్యంతర బెయిల్ తీసుకుని ఆయన బయటకు వచ్చారని.. ఆ తర్వాత తప్పించుకుని పారిపోయారని గడచిన రెండు రోజులుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసిన అనిల్… తానెక్కడికీ వెళ్లలేదని, చెన్నైలో తన తల్లి బాగోగులు చూసుకుంటూ ఆసుపత్రిలో ఉన్నానని పేర్కొన్నారు.

బోరుగడ్డ అనిల్ స్వయంగా విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎలా ఉన్నాను? అన్న వివరాలను వెల్లడించిన అనిల్… తనకు ప్రాణ హానీ ఉందని వాపోయారు. తనను చంపేసేందుకు కుట్ర జరుగుతోందని కూడా ఆయన ఆరోపించారు. ఈ కుట్ర వెనుక చంద్రబాబు, లోకేశ్ లతో పాటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఉన్నారని కూడా ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. తనకు గానీ, తన కుటుంబానికి ఏం జరిగినా… దానికి ఈ ముగ్గురే బాధ్యత వహించాలని కూడా అనిల్ పేర్కొనడం గమనార్హం. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం మేరకే తనను ఎలిమినేట్ చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

తన తల్లికి ఇటీవలే చెన్నలోని అపోలో ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని అనిల్ తెలిపారు. తన తల్లికి మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నా…ఐదుగురు ఆడ పిల్లలు, తాను ఏకైక కుమారుడినని తెలిపారు. ఈ కారణంగా తన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడిగా తనపై ఉందని తెలిపారు. ఈ విషయాలన్నీ కోర్టు ముందు పెట్టిన తర్వాత… వాటిన్నింటినీ పరిశీలించిన తర్వాతే కోర్ట తనకు ఇంటెరిమ్ బెయిల్ ఇచ్చిందని తెలిపారు. ఆ బెయిల్ గడువును పొడిగించాలని తాను కోర్టును కోరానని… అయితే తొలుత కోర్టు అందుకు అంగీకరించలేదన్నారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల ప్రకారం ాను గత నెల 28న జైలులో లొంగిపోయానని తెలిపారు.

జైలు అధికారుల ముందు తాను సరెండర్ అయిన తర్వాత కోర్టు తనకు మరోమారు బెయిల్ ఇచ్చిందని అనిల్ తెలిపారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని ఆయన తెలిపారు. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా అనిల్ సంచలన ఆరోపణ చేశారు. కర్నూలులో తనను పోలీసులు కొట్టారని… ఈ కారణంగా తన కాలర్ బోన్ విరిగిందని చెప్పారు. తనకు వచ్చిన ఈ పరిస్థితి పగోడికి కూడా రాకూడదన్నారు. లా చదివిన వాడిగా న్యాయస్థానాలపై తనకు గౌరవం ఉందని, కోర్టులను ధిక్కరించే పని తాను ఎప్పటికీ చేయనని తెలిపారు. కోర్టుల్లో తనకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. తనకు కన్నీళ్లు ఆగడం లేదంటూ అనిల్ ఈ వీడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.