నిజమే.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగేదే లేదని తేల్చి చెప్పేశారు. అందుకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సరేనన్నారు. అంతే… పిఠాపురంలో ఈ నెల 14న జరగనున్న జనసేన ఆవిర్భావ వేడుకల్లో జరగాల్సిన కార్యక్రమం శుక్రవారం సాయంత్రమే ముగిసిపోయింది. ఇదివరకే జనసేనలోకి పెండెం దొరబాబు చేరిక ఖరారు కాగా… శుక్రవారం ఆ లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. పెండెం దొరబాబు జనసేనలో చేరిపోయారు.
మంగళగిరి పరిధిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పెండెం దొరబాబును పార్టీ అధినేత హోదాలో పవన్ కల్యాణ్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ పార్టీ కండువాను దొరబాబుకు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో దొరబాబు అనుచరులు పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ గురించి దొరబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తన జీవిత కాలం పాటు పిఠాపురం ఎమ్మెల్యేగా కొనసాగాలని తాను ఆశిస్తున్నానని దొరబాబు అన్నారు. పవన్ కృషి… నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధలను చూసిన తర్వాత… పవన్ కు తనవంతు మద్దతు ఇవ్వాలన్న లక్ష్యంతోనే పార్టీలో చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు. పవన్ నేతృత్వంలో పిఠాపురం అభివృద్ధి రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికంగా నిలుస్తుందని కూడా ఆయన చెప్పారు.