50 రోజుల్లో 200 బెంచ్ మార్క్ కు చేరిన సేవలు

ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం ఏపీలో ప్రారంభమైన ఈ సేవలు జనాల్లోకి దూసుకెళుతున్నాయి. తమ సెల్ ఫోన్ల ద్వారానే అన్ని రకాల ముఖ్యమైన సేవలు లభిస్తున్న వైనంతో జనం కూడా ఈ సర్వీసుల పట్ల ఆసక్తి ,చూపుతున్నారు. ఫలితంగా అతి కొద్ది సమయంలోనే ఈ సేవలు బాగా ప్రాచుర్యం పొందాయి.

భవిష్యత్తులో సర్కారు నుంచి అందే ప్రతి సేవ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే అందించనున్నట్లుగా ఇదివరకే లోకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దశల వారీగా వాట్సాప్ గవర్నెన్స్ లో సేవల సంఖ్యను పెంచుకుంటూ వెళతామని ఆయన చెప్పారు.

నాటి మాటకు అనుగుణంగానే వాట్సాప్ గవర్నెన్స్ లో క్రమానుగతంగా సేవల సంఖ్యను ఏపీ సర్కారు పెంచుతూ సాగుతోంది. ఈ ఏడాది జనవరి 30న నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సేవల్లో తొలుత 161 సేవలు మాత్రమే లభించేవి. అయితే వాటి సంఖ్య ఇప్పుడు 200 బెంచ్ మార్క్ కు చేరింది. అంటే… కేవలం 50 రోజుల వ్యవధిలోనే ఈ సేవలు 200 మైలు రాయిని చేరుకున్నాయన్న మాట.

మన మిత్ర పేరిట ఏపీ ప్రభుత్వం ఈ సేవలను అందిస్తుండగా… ఈ సేవలకు సాంకేతిక సహకారాన్ని ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా అందిస్తోన్న సంగతి తెలిసిందే. పౌర సేవల కోసం వాట్సాప్ గవర్నెన్స్ పేరిట సరికొత్త పదాన్ని విన్నంతనే ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మెటా సంస్థ మారు మాట్లాడకుండా ఒప్పుకుంది.

ఇటీవల ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాగా… కాలేజీ యాజమాన్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులే నేరుగా తమ హాల్ టికెట్లను సెల్ ఫోన్ల ద్వారా డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ తరహా హాల్ టికెట్ల డౌన్ లోడ్ విద్యార్థులను ఇట్టే ఆకట్టుకుంది.

అంతేకాకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలను పొందుతున్న వారంతా ఆయా సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా మరిన్ని సేవల కోసం మన మిత్రనే వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. 9552300009 నెంబరు ద్వారా ఈ సేవలను ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేవలు ప్రారంభమైనంతనే… ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించడంతో ప్రభుత్వం కూడా మన మిత్ర సేవల సంఖ్యను పెంచుతూ పోతోంది. ఫలితంగా అతి కొద్ది రోజుల్లోనే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతున్న సేవల సంఖ్య 200 కు చేరడం గమనార్హం.