పాత సీఎం ఫాంహౌస్ లో.. కొత్త సీఎం ఢిల్లీ చుట్టూ

అదేం సిత్రమో కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వ్యవహరించే అధినేతల తీరు దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. వీరి మాదిరి మరే ముఖ్యమంత్రి వ్యవహరశైలి ఉండదన్న మాట బలంగా వినిపిస్తోంది. పనిలో పనిగా వీరి తీరుపై జోకులు భారీగానే పేలుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాట నుంచి నాన్ స్టాప్ గా పదేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన (కచ్ఛితంగా అయితే తొమ్మిదిన్నరేళ్లు) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ గులాబీ బాస్ ఎప్పుడు ఫాంహౌస్ కే పరిమితమయ్యే వారన్న పేరుండేది.

అయితే ఫాంహౌస్ లేదంటే ప్రజాభవన్ తప్పించి సెక్రటేరియట్ కు వెళ్లే వారే కాదు. ముఖ్యమంత్రి అయి ఉండి సచివాలయానికి వెళ్లరా? అన్న విలేకరి ప్రశ్నకు అప్పట్లో కేసీఆర్ ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలిసిందే. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే సీఎంవో.. దాని కోసం ప్రత్యేకంగా సచివాలయం వెళ్లటమేంటన్న ఆయన ఆన్సర్ కు దేశ ప్రజలంతా అవాక్కు అయిన పరిస్థితి.

కట్ చేస్తే.. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వ్యవహారశైలి కాస్త భిన్నంగా ఉంటుందన్న మాట వినిపిస్తున్న వేళ.. ఇటీవల కాలంలో ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. ఆయన ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటారో? ఎప్పుడు ఢిల్లీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 37 సార్లు ఢిల్లీకి వెళ్లారు. తాజాగా ఈ రోజు (గురువారం)సాయంత్రం 38వ సారి ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఎందుకిలా? అన్నది ప్రశ్నగా మారింది. తాజా పర్యటన విషయానికి వస్తే ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు అని చెబుతున్నారు. పనిలో పనిగా ఈసారి ఢిల్లీ టూర్ లో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసేందుకు అధినాయకత్వంతో చర్చలు జరిపేందుకని చెబుతున్నారు.

మొన్నటికి మొన్న కూడా ఎస్ ఎల్ బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకొని.. భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న వేళ.. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లటంపైనా విమర్శలు వచ్చాయి. అప్పట్లో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి.. ఇలా వారానికి ఒకట్రెండుసార్లు ఢిల్లీకి వెళ్లిరావటం మంచిది కాదంటున్నారు. గత సీఎం ఫాంహౌస్ ను.. ప్రజాభవన్ ను విడిచి పెట్టకుండా బయటకు రాకుండా ఉంటే.. ఈ ముఖ్యమంత్రి అదే పనిగా ఢిల్లీకి వెళ్లటం చూసిన తర్వాత.. తెలంగాణకు ఇలాంటి ముఖ్యమంత్రులు దొరుకుతారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.