వైసీపీ అధినేత వై ఎస్ జగన మోహన్ రెడ్డి కి గురువారం ఓ ప్రత్యేక ఆహ్వానం అందింది. ఎక్కడో కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నందీపుర పీఠం నుంచి ఈ ఆహ్వానం అందింది. ఇందుకోసం నందీపుర పీఠాధిపతులు నేరుగా అమరావతి పరిధిలోని తాడేపల్లి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. ఏప్రిల్ లో తమ పీఠం నిర్వహించనున్న శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం భూమిపూజకు హాజరు కావాలని వారు జగన్ ను ఆహ్వానించారు. గతంలో విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి వద్దకు జగన్ తరచుగా వెళ్లేవారు. మొన్నటి ఎన్నికలు ముగిసిన తర్వాత స్వరూప నందేంద్ర హిమాలయాలకు వెళ్లిపోయారు. దీంతో శారదా పీఠానికి జగన్ వెళ్లడం లేదు.
కర్ణాటకలోని విజయనగర జిల్లా కేంద్రంగా నందీపుర పీఠం కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 30 న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం భూమిపూజకు వారు ముహూర్తం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పీఠం పీఠాధిపతులు జగన్ ను కోరారు. ఈ మేరకు జగన్‌కు పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ (నందీపుర పుణ్యక్షేత్రం), పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్ళి), జడేశ్వర తాత (శక్తి పీఠం, వీరాపుర), కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్, సండూర్)లు ఆహ్వానపత్రిక అందజేశారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కడంతో జగన్ సహా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. అదే సమయంలో జగన్ కూడా ఎక్కువ సమయం కర్ణాటక రాజధాని బెంగళూరులోని తన విలాసవంతమైన ప్యాలస్ లో ఉంటున్నారు. అవసరం ఉన్నప్పుడు అమరావతికి వస్తున్న జగన్ ఆ తర్వాత నేరుగా బెంగళూరు వెళుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని పలువురు రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లో జరుగుతున్న కార్యక్రమాలకు కూడా హాజరు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కు నందీపుర పీఠం ఆహ్వానం అందడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates